ఎవరో పల్కరించినట్లుగా అన్పించి చుట్టూ చూశాను.ఎవరూ లేరు
ఇటు తిరిగితే ఎదురుగా నిలబడి ప్రశ్నిస్తున్నాడు .
నాలో దాక్కున్న అసలు మనిషి బయటకొచ్చి
నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా ? అని
ఈసారి గద్దించి నట్లుగా అడిగాడు .
అవును నిజమే నేను ఇంకా బ్రతికే ఉన్నానంటే
ఆశ్చర్యంగానే ఉంది.నాక్కూడా !
ఒక్క పిడుగు పడితేనే పచ్చని చెట్టు
నిలువునా మాడిపోతుంది కదా ?
మరి పిడుగుల వర్షం కురిస్తే - ఇంకా ఏముంటుంది?
బూడిద…… అదే నా పరిస్థితి…. అందుకే ఆ ప్రశ్న అంత కఠోరంగా ప్రతిధ్వనిస్తోంది.
నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా ? అని.
నానా బాధలు పడి ఆనాడు ఇల్లాలి పుస్తెలు తాడును తాకట్టుపెట్టి
ఇచ్చిన చోటల్లా అప్పులు తెచ్చి ఇల్లు కట్టు కున్నాను.
ఇంట్లో స్లాబు సెంట్రింగ్ ఊడతీసిన తరువాత క్రింద పడ్డ సిమెంటు అచ్చుల్ని
బయటపడేయడానికి గదికి ఐదు రూపాయలు అడిగితే ముఫై రూపాయలు ఎందుకని
మేమిద్దరం, పిల్లలిద్దరూ [7,10 ఏళ్ళు] కలిసి ఒళ్ళు గుల్ల చేసుకొని ఆ సిమెంటు అచ్చుల్ని
బయటపడేసి ఏదో మిగుల్చుకున్నామనుకున్న రోజులవి…….
కాలం గడుస్తోంది…….
అటువంటిది 1992 లో ఒక మంగళవారం అర్థరాత్రి 2.20 ప్రాంతంలో దొంగలు ఐదారుగురు
బండరాళ్ళతో తలుపులు బద్దలుకొట్టుకొచ్చి దాడి చేశారు.
ముసుగు వేసి కత్తి తో డొక్క లో పొడిచాడొకడు. పిల్లలు,ఆమె ఆక్రందనలు. పిల్లలిద్దరు
మంచం మీద భయం తో ఏడుస్తున్నారు.వాళ్ళని ఒకడు కత్తి తో బెదిరిస్తున్నాడు. ఏడుస్తూ మంచం పక్కనే నిలబడ్డ ఇల్లాలి మెడలో సూత్రాలతాడు ను లాగేసుకున్నాడొకడు.
బీరువా తీసి సర్దుకుంటున్నాడొకడు.పై అరలోని కాగితాలన్నీ బయటకు విసిరేస్తూ,
దాచుకున్న చిన్న చిన్న వెండి సామాన్లు,చిల్లర డబ్బులు ,పిల్లలకు బట్టలు కొందామని
మూడునాలుగు నెలలుగా కూడబెట్టి , రెండు మూడు సార్లు లెక్క పెట్టుకొని దాచిపెట్టిన
మూడువేలకు పైచిలుకు డబ్బులు సర్దుకొని హడావుడిగా వెళ్ళిపోయారు దొంగలందరూ చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు లేచిన అలికిడి వలన అయ్యుంటుంది. ముసుగు లోంచి దృశ్యాదృశ్యం గా జరుగుతున్నదంతా కన్పిస్తూనే ఉంది నాకు.ఆ కేసు రెండు సం.రాల పైనే నడిచింది.
అందుకే …. ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావా అనేది ప్రశ్న. ఇంతలో………
2007 లో పాతికేళ్ళు పెరిగిన రెండోవాడు అర్ధం కాని వ్యాధితో హాస్పిటల్స్ లో రెండు నెలలు పోరాడి ఋణం తీర్చుకొని వెళ్ళిపోయాడు. ఇంకా బ్రతికే ఉన్నాను.
మధ్య మధ్యలో చిన్న చిన్న దెబ్బలు తగులుతున్నా, తట్టుకుంటూ కాలు విరిగిన కుక్క లాగా
పాక్కుంటూ బతుకు బండి ఈడుస్తున్నాను.
ఇంతలో మహాప్రళయం ముంచుకొచ్చింది. నా జీవన జ్యోతి నుంచి ఆర్పేసి ఉంది.ఏవేవో విడవని రోగాలతో బాధపడుతున్న ఎదురుగా ఉంటే చాలనుకున్నా.కాని ఆమె కూడా వెళ్ళిపోయింది.
జీవచ్ఛవంలా మిగిలి పోయాను. ఎటుచూసినా చీకటి.ఏముంది చూడ్డానికి గాఢాంధకారం తప్ప.
మనసు మూగ వాపోయింది.మెదడు మొద్దు బారింది. ఆలోచనలు ఆగిపోయాయి.
ఎక్కడ ఉంటే అక్కడే.అంతా అయోమయం
అందుకే
నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా?అంటోంది అంతరాత్మ.












