Wednesday 29 May 2013

తెల్లవారనీకు ఈ రేయినీ

               తెల్లవారనీకు రేయినీ
           
     వేసవి కాలమంటేనే మల్లెపూలు, మామిడి కాయలతో పాటు పెళ్ళిళ్ళకు కూడ  సీజన్. ప్రతిరోజూ ఎవరెవరివో అయినవాళ్లవి, ఆత్మీయులవే కాకుండా  తెలిసిన వాళ్ళు, పరిచయస్తులవి ఏవో శుభలోఖలు వస్తూనే ఉంటాయి. అయినవాళ్ళవయితే శుభలేఖతో పనేలేదు. సంబంథం కుదిరిన దగ్గర నుండి మనం టచ్ లోనే ఉంటాం కాబట్టి శుభలేఖ అందకపోయినా మనం పెళ్లికి రెడీ.  అసలు పెళ్లి వారి కంటే ముందే మనం నగలు,బట్టలు కొనేసి, రెడీ అయిపోతాం. శుభలేఖ పోష్టులో  వేశాం. వచ్చిందా?”   అని అట్నుంచి ఫోన్     రాలేదే, ఫర్వాలేదులే అంటాం  మనం . కొరియర్ లో మళ్లీ పంపిస్తున్నాం అంటారు వాళ్లు. ఏదో విథంగా శుభలేఖ అందకపోయినా తర్వాత అందుతుందిలే అని పెళ్లికి బయలుదేరతాం.   ఇదీ అయినవాళ్ల పెళ్లి కి మన హడావుడి.

                   ఇంతకీ చెప్పదలచిందేమిటంటే మధ్యన మా తమ్ముడు వాళ్ళ పెద్దాడిది వివాహ మైంది. మరి తప్పని సరిగా వెళ్లాలికదాసెలవలకు పిల్లల దగ్గరకొచ్చి ఉంటున్నాం . కాబట్టి ఆహ్వానం హైదరాబాదు వచ్చేసింది. ఆఫీసుకి సెలవు పెట్టి  కొడుకు, కోడలు రెడీయై పోయారు. వెళ్లాల్సిన ఊరికి మా ఊరు మీద నుంచే వెళ్లాలి .ఇల్లొదిలి వచ్చి నెలరోజులై పోయింది. అద్దె వాళ్లు ఏం చేస్తున్నారో అన్నది శ్రీమతి.  సరే! రాత్రికి మన ఊళ్లో ఆగి పొద్ద్దున్నే  బయలుదేరి  పెళ్లికి వెళదాం  అనుకున్నాం.
                   అయితే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఒకటుంది. హైదరాబాదు లోఉంటున్న మా మనవడి కి తాతగారి ఊరంటే ఎందుకో అంతులేని ప్రేమవాడికి నాలుగేళ్ళు. కాని తాతగారింటికి వెడుతున్నామని తెలిసినప్పటి నుంచి  వాడు ఒకటే ఆనంద పడిపోతున్నాడు. మధ్యాహ్నం పడుకోను కూడ పడుకోకుండా ఊరిను గురించి ఏవేవో వచ్చిరాని కబుర్లు చెపుతూనే ఉన్నాడు
                           ఎందుకంటేఅపార్టుమెంటుల్లో  బోనులోని జీవుల్లాగా ఉండే జీవితం నుంచి   ఒక్కసారిగా  మూడంతస్తుల విశాలమైన ఇల్లు, ఇంటి ముందు వెనుక ఖాళీప్రదేశం, ఇంటి ముందు చక్కగా  పెరిగిన పూలమొక్కలు, దూరంగా పెద్ద పెద్దవేపచెట్లు.టేకుచెట్లుపక్కవాళ్ల దొడ్లో గేదెలు,దూడలు, మాటి మాటకి అరచి గోల చేసే ఒక కుక్కపిల్లక్రింది భాగంలో అద్దెకుండే వాళ్ల పిల్లలుఅప్పుడప్పుడూ వచ్చి పలకరించి పోయే తెల్లపిల్లి, పోర్టికోలోకి వచ్చి కూర్చునే సూర్య,చంద్రులు --- ఇవన్నీ వాడికి కావాలిఅన్నింటికీ  మించి దగ్గరలోని ఏటినుంచి వచ్చే చల్లనిగాలి , షోకేసు కన్పించే రకరకాల బొమ్మలు   మరీ ఇష్టం.   మళ్లీ  అమ్మ, నాన్న కావాలి. వాళ్లను వదిలి ఉండడువాళ్లు ఆఫీసుని వదిలి ఉండరు. అందుకే ఎప్పుడో కాని అవకాశం రాదుకాబట్టే వాడికి అంత ఆనందం.
                   

          రాత్రి పదకొండు గంటలకు మా ఊరు చేరాం. మార్గమద్యం లోనే ఆత్మా రామునికి నైవేద్యం పూర్తయ్యింది కాబట్టి స్నానాలు చేసి మంచాల మీద వాలాం. .సి అలవాటైన వాళ్లు లోపలిగదుల్లో పడుకున్నారు. . మొదటి అంతస్తులో పోర్టికోలో మంచాలు వేసుకున్నాం . డ్రైవర్ దూరంగా పక్కపరుచుకున్నాడుఇంతలో పరుగెత్తుకుంటూ వచ్చి  మనవడు నా మంచం మీద  కు చేరాడు. ఇక మొదలైంది ప్రశ్నల వర్షం.
        తాతా! చెందమామ ఎంత బాగున్నాడో. !
        అవును.  అన్నాను నేను
        అబ్బో ! ఎంత ఆకాశమో !   సంబరంగా అన్నాడు
         ఆకాశంలో ఫిష్ లేవి?   ప్రశ్న
          ప్రశ్నే నాకర్థం కాలేదు .
          ఉండవులే. అన్నాను నేను
          ఆహా .!    మరి  ఇన్ని స్టార్స్ ఎక్కడివి.
           ఇక్కడ ఇలానే ఉంటాయి.  
           చెందమామ అంత పెద్దగా ఎందుకున్నాడు.? మరో ప్రశ్న .
    రోజు పౌర్ణమి.అందుకని చంద్రుడు పెద్దగా కన్పిస్తున్నాడు. మాటే చెప్పాను. ఏమర్థ మైందో ఏమో ఆహా! అన్నాడు.
                   ఒకపక్క నిద్ర ముంచుకొస్తోంది నాకు .కాని వాడికి మాత్రం నిద్ర రావడం లేదు. ఎందుకంటే  తెల్లవారితే మళ్లీ  ఇక్కడ నుంచి బయలుదేరి వెళతాం . కాబట్టి అపు రూప అవకాశాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయాలనే దృఢనిశ్చయం లో వాడు ఉన్నట్లు అర్థమైందివాడే కాదు. వయసులో ఉన్న పిల్లలు ఎవరైనా ప్రస్తుతం అదే స్థితిలో ఉంటున్నారు. చందమామకు, చల్లగాలికి,పచ్చనిచెట్లకుకిల కిల లాడే పిట్టలకు,పచ్చని పంటచేలకు, పిల్లకాలువ లకు దూరమై, కాంక్రీట్ జంగిల్ లో జీవిస్తున్న నేటి మనవారికి ఇవన్నీ వింతగానే ఉంటాయి. అటు వంటి   ఎన్నో పసి హృదయాలకు వీడొక రూపకం మాత్రమే
                                పోగుపోసిన బొమ్మలతో కాసేపు ఆడుకున్నాడు. ఇంతలో పక్కవాళ్ల దొడ్లో దూడ  అరచింది.గబగబ వచ్చి తాతా! శబ్దం ఏమిటి.? అన్నాడు. చెప్పాను. దానికి పాలు ఎవరిస్తారు  ?” మళ్ళీ ప్రశ్న.  
                                 తెల్లవారుఝాము మూడై పోయిందిగూర్ఖా వచ్చి గేటుమీద కొడుతున్నాడు. మళ్లీ  అదే ప్రశ్న. శబ్ధం ఏమిటీ చెప్పాను. దొంగోడా  ? కాదు దొంగల్ని పట్టు కొనేవాడు.అన్నాను. ఆహా! అని ఊరుకున్నాడు. ఇంతలో వాళ్ల అమ్మ వచ్చి  తెల్లారి పోతోందని నిద్రపుచ్చడానికి బలవంతంగా తీసుకెళ్లింది. కాని వాడుమాత్రం నేను ఆడుకోవాలి అంటూ మారాం చేస్తూనే ఉన్నాడు. నిద్రపోయిరామ్మా! మళ్లీ ఆడుకుందాం.!” అన్నాను  నేను.  వాడు అయిష్టం గానే వెళ్లాడు.
           కాని  మళ్లీ  నాకే అనిపించింది. వాడు నిద్రలేచే సరికి చంద్రుడు , రాత్రి ఉండవు కదా.! చందమామ వెళ్లిపోయి మటమట లాడుతూ సూరీడు బావ వచ్చేస్తాడు గదా.!  అని. వెంటనే నాలో ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. రాత్రి తెల్లవారకుండా ఇలానే  రెండు మూడు రోజులుంటే ,వాడు నిద్ర లేచి ఆడుకుంటాడు కదా.! అని. అయితే  నా  లోని పిచ్చిఆలోచనకు  నాకే నవ్వొచ్చింది. కొన్ని సందర్భాల్లో అలానే అన్పిస్తుందేమో.!
                 అప్పుడే  ఒక సినీకవి ఎప్పడో వ్రాసిన పాట లీలగా మదిలో మెదిలింది .తెల్లవారనీకు రేయినీ ......... అని . సందర్భం ఆ రాత్రి  ఆ నాయికా నాయకులకు అంత ముఖ్యమైంది, ఇష్టమైంది కావచ్చు. అందుకనే వారు అలా పాడుకున్నారుకాని నాకు సందర్భంలో  అలా అనిపించడం మాత్రం కొంచెం స్వార్థమే  ననిపించింది. ఆకాశం లోని చందమామ  నవ్వుతూ ఇంటి చాటుకు తప్పుకున్నాడు.  నెమ్మదిగా నిద్రాదేవి ఒడిలోకి జారిపోయాను నేను.





**************************************************************************************