Friday 7 December 2012

తెలుగువారి ఆడపడుచు శారద


          తెలుగు    వారి   ఆడపడుచు     శారద
              


                   తెలుగు సాహిత్యం లో తమకంటూ ఒకప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అతి కొద్దిమంది నవలా రచయితల్లో శ్రీ అడవి బాపిరాజు గారు ఒకరు.గాంధీజీ సిద్ధాంతాల  ప్రభావంతో పాటు కాల్పనిక,మానవోద్యమ , హైందవోద్యమాల ప్రభావం 1920 తర్వాతే  తెలుగు సాహిత్యం మీద ప్రసరించింది. అది గాంధీజీ భారత రాజకీయాల్లోకి ప్రవేశించిన కాలమవ్వడం గమనార్హం. అడవి బాపిరాజు గారు రచించిన నారాయణరావు నవల ఆ తరానికి చెందినది.
                 
                   శారద     అడవి బాపిరాజు  గారి నారాయణ రావు నవల లో నాయిక. బాపిరాజు లోని జాతీయభావాలన్నీ కదలి వచ్చి పరకాయప్రవేశం చేసి నారాయణరావు ను నవలా నాయకుడి గా నిలబెడితే, బాపిరాజు లోని ఊహలన్నీ రెక్కలువిప్పి ఎగిరి వచ్చిశారద లో ప్రవేశించి ఆమెను నాయికను చేశాయి.అందుకే శారద తెలుగు వారి ఆడపడుచు గా  తెలుగు హృదయా లకు దగ్గరయ్యింది.
                 
                    శారద ఆశ్వలాపురం జమీందారు గారి కుమార్తె. శారద యనగానే ముగ్ధ వనలక్ష్మి వంటి తెలుగు బాలిక హాస ప్రపుల్ల వదనయై,మన ముందు నిలుస్తుంది. పూలతోట లో పూలుకోయుచున్న శారద ను తొలిసారి గా పాఠకులకు పరిచయం చేస్తాడు కవి.            మల్లీ   మాలతు ల స్వచ్ఛ హృదయార్ధ్ర శ్వేతవర్ణములు, చంపక,కనకాంబరముల సువర్ణ రాగములు,నీలాంబర నిర్మల నీలములు,కలసి చిత్ర రూపమై సొగసు నింపగ పూలతోటలో పూలు కోయు శారద పాఠకులకు కన్పిస్తుంది.
                    
                   “  పూల చరిత్రలన్నియు నామె వల్లించినది.పూలమనసులు,పూలబాసలు ఆమె ఎరుగును. ఏఋతువున ఏ పూలవతరించునో ఏప్రదేశమున ఏ పూలు కళకళలాడి పోవునో,  హాస ప్రపుల్ల వదనయై శారద చెప్పుచుండును.   ఇది శారద ను గూర్చి కవి పరి చయం.   ఇక శారద  రూపాన్ని కవి చిత్రించిన తీరు చూడండి.
           
                         “ శారదా కుమారి సౌందర్యమూర్తి. ఆమె నేత్రములు విస్ఫారితములై.            అర్ధ నిమీతములై,దీర్ఘ నీల వర్త్మాంచలములై, విచత్ర జీవిత నాటకమునాలోకించుచూ, ఆశ్చర్య హాసముల వెదజల్లుచుండును.  నల్లని పాపలు  రెప్పల మాటున సగము దాగికొని,యామినీ నీలాకాశ గంభీరలై  తోచును.  ఇది నాయిక నేత్రములను కవి వర్ణించిన తీరు.
                     
                  ఆమె శరీరఛాయ  మేలిమి బంగారు రంగుతో తామరల ఎరుపు కలిగినదట. నవ యౌవనపు తొలి వెలుగు లామె ఫాలముపై, నాసికాగ్రముపై, బుగ్గలపై, పెదవులపై, చుబుకముపై,  కంటిపైరెప్పలపై ,  చెవుల తమ్మెలపై , వర్తించుచుండును. తొలి యౌవనపు కాంతులు ప్రతిఫలించే తీరును  చిత్రకారుడు గా దర్శింప చేశారు బాపిరాజు.
                  
                         స్వప్న సీమలగు కనుబొమలు సన్ననై చంద్రవంక వంపులు తిరిగి  చెక్కుల్లో మాయమౌతున్నాయి. బంగారు గన్నేరు వంటి ముక్కు, విలువంపగు అరుణోత్త రోష్టముపై బంగారు మేడ కట్టినది. మథ్య సుడి నొక్కు తో కాశీరత్నపుష్పముల జంట బోలి (1) యామె క్రింది పెదవి యందగించుచున్నది. లేత దానిమ్మపూవు ( 2 ) యామె చుబుకము. పదునాలుగేండ్ల యెలప్రాయపు మిసిమిరేకలు కర్ణములనుండి యంగుళీ యాంచలములకు ఎత్తిపోతలైనవి ( 3). బాహు మూలముల నుండి పాదతలములకు సొంపు లెగబోయు ఏటి కెరటాల వంపులు (40 మిలమిలలాడిపోవు కమ్మని చందన వర్ణపు పట్టుపరికిణీ మడతలలో మెలివడిపోయినవి.నానాట ఆనంద కిసలయములై మొలకెత్తు ముగ్ధ భావములు గులాబీ రైక మబ్బుల, నీలిపయ్యెద జిలుగు వెలుగుల ( 5) తొంగి చూడ సాగినవట.
          
                         ఈ  ఐదు వర్ణనలు కుంచెతో గీసిన రంగుల కలయికలే గాని శ్రవ్యకావ్య వర్ణనలు కావు. ముఖ్యంగా – క్రింది పెదవికి కాశీరత్నపుష్పాల రంగు, గడ్డమునకు లేత దానిమ్మ పూవు రంగు  చెప్పడం లో  పరమార్ధం కవికి కనుల ఎదుట కాన్వాస్ మీద ముద్దులొలుకు తెలుగు బాలిక శారద రూపం కన్పిస్తుండటమే.  గంధపు రంగు పట్టు పరికిణీ, గులాబీరంగు రైక ధరించింది.ముగ్ధభావములు గులాబీరైకమబ్బుల, నీలిపయ్యెద జిలుగు వెలుగుల తొంగిచూడసాగినవట.- ఎంత ఉదాత్త గంబీర వర్ణన. నాయికా వర్ణన లో అతి సున్నితమైన దృశ్యాన్ని అత్యంత శిల్పమధురంగా  వర్ణించాడు కవి. సొంపులెగబోయు ఏటి కెరటాల వంపులు పరికిణీ మడతలలో మెలివడుట.  కుంచె పట్టిన చిత్రకారునికి కులపతి గా యిచ్చే సూచనలా  కన్పిస్తోంది కాని ఆ రూపము పాఠకుని హృదయం లో స్ధిరంగా నిలిచి పోతుంది. అది బాపిరాజు  కవి  (పని) తనం.
              
                         ప్రక్కపాపిట తీసుకొని,ఒత్తయిపొడవైన శిరోజాలను పొడవైన వాలుజడ గా మలచుకొని, కాళ్ళకు జరీబుటాపూవులమొఖమల్ చెప్పులు తొడిగికొని చెవులలోలాకులతో, కుడిముక్కున కున్న బేసరి తో, మెడను హారము లలో రవ్వలు,నీలాలు,కెంపులు తళుకు మనగా,నెమ్మదిగా పూవులను తాకుతూ  ఒయ్యారంగా అడుగులు వేస్తూ, తోటలో విహరిస్తున్న శారద తండ్రిగారి రాకతో ఇంట్లోకి  ప్రవేశిస్తుంది .
                     
              శారద జమీందారు గారి కుమార్తె. జమీందారు గారు జాతీయ భావాలు గల వ్యక్తి. ఒక రైలు ప్రయాణం లో నారాయణరావు ని చూసి అందం లో అర్జునుడు.బలం లో భీముడు అనుకొని అతన్ని అల్లుడు గా నిర్ణయించుకొని ఇంటికి ఆహ్వానిస్తారు. పెళ్లిచూపులు చూసి వెళ్లిన నారాయణరావు తన స్నేహితునికి లేఖ వ్రాస్తూ, మీ చిత్రకారమండలి లో ఆమె బొమ్మ చిత్రించడానికి ఒక్కరికైనా కుంచె నడవదోయి. ఆమె శరీరసౌష్టవం విడివడ బోయే మల్లెమొగ్గలపోగేరా!. అని వ్రాసుకుంటాడు. ముగ్దమోహన సౌందర్యాన్ని విడివడపోయే మల్లెమొగ్గల పోగుగా ఊహించడం ఎంతఅద్భుతమైన పరికల్పనో చూడండి.
          
          రాయబారాలు, ఆలోచనా సాలోచనలు, ఇచ్చిపుచ్చుకోవడాలు,రాకపోకలు సాగి చివరకు రాజమహేంద్రవరం లో శారదా నారాయణరావు ల వివాహం ఐదు రోజులు ఆర్భాటం గా జరిగింది. కాని శారద తల్లి, దగ్గర బంధువులు, ముఖ్యంగా  శారద ను చేసుకుందామని ఆశపడి భంగపడిన ఆమె బావ జగన్మోహనరావు నారాయణరావు పై ద్వేష భావాన్ని కలిగించి శారద మనసును విరిచేశారు.తెలిసీ తెలియని వయసు లో శారద నారాయణ రావు పై వ్యతిరేకతను , ఏహ్యభావాన్ని పెంచుకొంది. అదే కారణంగా మొదటి రాత్రి ఏకాంతం లో  భర్త నారాయణరావు తో నీ పై నాకు ప్రేమలేదని ఖచ్చితంగా చెప్పేసింది. అంతేకాకుండా జగన్మోహనరావు తో చనువుగా మెలగ సాగింది.

                   ఏదో విధంగా శారద ను పొందాలని తపన పడుతున్న జగన్మోహనుడు మాయమాటలతో చాలాసార్లు శారద కు దగ్గరౌతూ,వెకిలి గా ప్రవర్తిస్తుండేవాడు. అతని ఒంటినుండి వచ్చే విదేశీ సెంటు వాసనలకు ఏదో తెలియని స్థితిని శారద లో కల్గిస్తుంటాయి. శారద ఎంగిలి కాబోయే ప్రతి సమయం లోను ఆమె చిన్నతమ్ముడు హఠాత్తుగా రావడం, అనుకున్నది  పొందలేక జగన్మోహనుడు చిరాకుపడటం, అమాయకత్వం లో లొంగిపోబోయిన శారద రక్షించబడటం అనేకమార్లు జరుగుతుంది. ఆ సమయం లో పాఠకుడు హాయి గా ఊపిరి పీల్చుకుంటాడు. 

                       కాలం తో పాటు కథ కూడ అనేక మలుపులు తిరుగుతుంది. అనేక విషయాల్లో తన భర్త గొప్పతనాన్ని లోకమంతా పొగుడుతుంటే తానెందుకు వ్యతిరేకిస్తు న్నా నన్న ఆలోచన నెమ్మదిగా శారద లో ప్రవేశిస్తుంది. ఇది పరిణిత వయస్కురాలైన తెలుగింటి ఆడపిల్ల మన:స్ధితి. ఎవరో చెప్పే మాటలు విని  కాపురాన్ని కూల్చుకోవడం బుద్దిమంతుల లక్షణం కాదు గదా!.

                          ఆ రోజు రాత్రి  శారద ను పూర్తిగా పొందాలని ఉదయం నుండే రంగం సిద్ధం చేసుకున్నాడు జగన్మోహనరావు. భర్తకు దూరంగా  ఉంటున్న ఒక తెలుగింటి ఆడపిల్ల శారద కు రకరకాల ఆంగ్ల పత్రికలు ,పుస్తకాలు ఇచ్చి ఆమెను ఉత్సాహ పరచి గీత దాటించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలు ఆ రాత్రి కి  పండబోతున్నాయని కలలు కంటున్నాడు. శారద ,జగన్మోహనులు కలిసి భోజనానికి కూర్చున్న సమయంలోనే  నారాయణరావు వచ్చాడన్న కబురు విని కంచం ముందు నుండి ఆనందంగా లేచి వెడుతుంది  శారద.   

                                  అప్పుడు చూడాలి జగన్మోహనుని ముఖాన్ని. చేతిలో మిఠాయి కాకి తన్నుకు పోయినట్లు ఖిన్నుడై పోయాడు . కాళ్లు కడుక్కుని వస్తున్నభర్తకు తువాలు ఇవ్వడానికి ఎదురు వెళ్లింది శారద. ఆశ్చర్యపోయాడు నారాయణ రావు . శారదా! భోజనమైందా?” అని  ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకే శారద ఎంతో మురిసి పోయింది. సిగ్గులమొగ్గై, గొంతుకను హృదయం చిందరవందర జేయ, లేదు మీతో కూర్చుండవచ్చునా!” అని జవాబిచ్చింది. ఇది ఆమె భర్తతో మాట్లాడిన మొదటి అనురాగపు పలుకు.  తెలియని వయసులో జరిగిన వివాహము, తరువాత భర్త ఔన్నత్యాన్ని గుర్తించడానికి రెండు వసంతాలు గడచి పోయాయన్న మాట.

                      తీయని ఊహలతో భర్త గదిని చేరబోతున్న శారదను మేడమెట్ల వద్ద కాపువేసి, బలవంతంగా కౌగిలించుకొని, కాటు వేయబోయిన జగన్మోహనుని సహించలేక పోయింది శారద లోని భారతీయత .ఆమెలోని హైందవ నారీ రక్తము ఒక్కసారిగా విజృంభించి అతని చెంప ఛెళ్లు మనిపించ గలిగింది.బల్లిలాగా గోడకు అతుక్కుపోయాడు జగన్మోహనుడు. ఇది నాయిక పాత్రలోని పరిణతిని కవి నిరూపించిన విధము .

                                                   శారద కు వయసు తో పాటు ఆలోచనా విధానము  పరిశీలనా సామర్ధ్యము పెరిగాయి.మంచి చెడులను వేరుచేసి చూడగల పరిణతి వచ్చింది. కలతలు తీరాయి. మనసులు కలిశాయి.  ఆడబిడ్డ సాయం తో తన గదిని తానే అలంకరించుకొనే ఆరిందాగా తయారయ్యింది శారద.

                   భార్య  చెల్లెలు తో కలసి  గది అలంకరిస్తుండగా లోనికి రాబోయి, ఆశ్చర్యం తో వెనుదిరిగిన నారాయణరావు రాత్రి పదకొండుగంటలు దాటిన తరువాత తన గదికి చేరుకున్నాడు. 

                    శారద మంచముపై దివ్యరూపయై నిదురపోవుచున్నది. గంగానదీ ప్రవాహములతేలియాడు శ్వేతహంసి వోలె ఆమె పవళించి యున్నది. ఒక ప్రక్కకు తిరిగి తలక్రింద లలిత లవంగ సుందరమగు బాహువినుపధానమొనర్చి,ఆమె మోహనభంగిమా రూపయై అందు పరుండియున్నది. చిరకాలవియోగం తర్వాత తన ఇల్లాలిని నారాయణరావు చూచిన దృశ్యమిది.

                       నారాయణరావు నెమ్మదిగా  తలుపు గడియ వైచి తన మంచము వైపు తిరిగినాడు. శారద మంచము నుండి దిగి పూల పళ్లెము నందు కొని అతని పాదముల పూజ చేయుచు, శ్రీరామ పాదమా యన్న కృతి ని మధుర కాకలీ స్వనం తో పాడుకొన్నది.

                   సంపూర్ణ జ్యోత్స్న లా నాయకా నాయికల తో లీనమై పోయినవి. తారకలు  ఆ దంపతులను దివ్యప్రేమ పూరిత జన్ములు కండని ఆశీర్వదించినవి.

                             ఇది నవలకు ముగింపు. ఎన్నో సుమనోజ్ఞ సుమధుర భావనా భరిత సన్నివేశాలు కళాఖండాలుగా పాఠకులముందు నిలబడి విచలితుల్ని చేయడం  శ్రీ బాపిరాజు శైలిలోని ప్రత్యేకత. బాపిరాజు  సృష్టించిన స్త్రీ మూర్తు లందరూ అపురూప లావణ్య సీమలే కాని  వారిలో శారద ఒక ప్రత్యేక మైన పాత్ర .

                                     అందుకే తెలుగు వాకిట  వికసించిన ముద్దబంతి వలె   మధుర మంజుల మనోహరమై మృదు దరహాస వికసిత వదనయై    తెలుగు సాహిత్యం లో        చి. సౌ  గా  కలకాలం నిలిచి పోయే పాత్ర  ఈ  శారద.

                ఈ వ్యాసం లో కవి రచనా శైలి కొంచెం గ్రాంధికం గా కనిపిస్తుంది. ఆ    పద మాధుర్యాన్ని  మీతో కలిసి మరల  ఆనందించడానికే ఆ కవి వర్ణనలను కొన్నిచోట్ల యథా తథంగా వాడాను.  అది  తప్పనిసరి యైంది కూడ .సహృదయంతో ఆస్వాదించండి,



*******************************************************************