Friday 13 June 2014

దెయ్యం వచ్చిన రాత్రి

                                       దెయ్యం వచ్చిన రాత్రి
                        
                     కొన్ని విషయాలు తలుచుకుంటే నవ్వొస్తాయి. మరికొన్ని చెప్పుకుంటే  ఎంతో హాయి నిస్తాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది రెండవది.
                 
                 అవి నేను ఆగిరిపల్లి కాలేజీ లో చదువుకొనే రోజులు.  మా కాలేజీ కి ఆనుకొని  దేవుడి పూలతోట ఉండేది. ఆగిరిపల్లి శ్రీ శోభనాచల లక్ష్మీ నరసింహ స్వామి వెలసిన దివ్యక్షేత్రం కదా . ఆయనదే  ఈ పూల తోట.   ప్రతిరోజు  శ్రీ స్వామి వారి పూజ కు పూలు, పూలదండలు ఇక్కడ నుంచే వెళుతుండేవి. ఆ తోటమాలి పేరు గంగయ్య.
                                           నేను సెలవల్లో కూడ ఇంటికి వెళ్లకుండా హాష్టల్లోనే ఉండేవాడిని. వండుకోవడం అలవాటే కాబట్టి ఇబ్బంది అనిపించేది కాదు . సెలవలకు ఇంటికి వెళితే మాది ఉమ్మడి కుటుంబం కాబట్టి  మేనత్తల పిల్లలు , బాబాయి పిల్లలు సెలవలకొచ్చి ఇంటినిండా ఉంటారు  చదువుకోవడానికి వీలుండదని నేను చెప్పుకోవడం  మా తాతగారు కూడ ఒప్పుకోవడం తో  సెలవల్లో కూడ  హాష్టల్లో ఉండే అవకాశం లభించింది. సరే అసలు కథ ఇక్కడే మొదలైంది.
              
                            ఒకే  ఆవరణ లో  కాలేజి భవనం , రెండు హాష్టలు భవనాలు ఉండేవి.చుట్టూ పది, పన్నెండు ఎకరాల ఖాళీ స్ధలం ఉండేది.  హాష్టలు అంటే కేవలం  ఉండటానికి గదులిచ్చేవారు. గదికి ఇద్దరు ముగ్గురం ఉంటూ వండుకొని తింటుండే వాళ్లం. తిండి సరిగా ఉన్నా లేకపోయినా చదువులో మాత్రం విపరీతమైన పోటీ ఉండేది. నైట్అవుట్ , బ్లాక్ టీ అనే పదాలు రెండవ సంవత్సరం నుంచే అలవాటై పోయేవి.

                                          అదేమిటో గాని కరెంటు పోయిన రాత్రుల్లో అందరం ఒక చోట చేరి చెప్పుకొనే కబుర్లలో దయ్యం కధలే ఎక్కువుండేవి. మా హాష్టల్ కి నైరుతి లో ఒక పెద్ద  మోట బావి ఉండేది. మాకే  కాక చుట్టుప్రక్కల వాళ్ళకు కూడ ఆ బావి నీళ్లే ఆధారం. అయితే ఈ బావిలో ఎవరెవరో దూకి చచ్చిపోయారని ,వాళ్ళలో బాలింతరాళ్లు , పెళ్ళికూతుళ్లు కూడ ఉన్నారని , రాత్రి పూట గజ్జల చప్పుడు ,  పసి పిల్ల ఏడుపు వినిపిస్తుందని   మా సీనియర్లు భయపెడుతుండేవాళ్ళు. అవి ఊసు పోక కబుర్లయినా  అప్పుడప్పుడు ఒంటరిగా రాత్రి పూట బావి దగ్గరకు వెళ్లినపుడో , హాష్టల్లో ఒంటరి గా ఉన్నప్పుడో గుర్తుకొచ్చి భయపెడుతుండేవి.  

                                అయితే సెలవల్లో కూడ అక్కడే ఉండి చదువుకోవడానికి నా లాగానే ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్లు.  పగలంతా  వేరే వేరే చదువుకున్నా రాత్రి వేళ పడుకునే సమయానికి మాత్రం ఒకచోటు కి చేరేవాళ్లం. ఒకసారి అనుకోకుండా మిగతావాళ్ళిద్దరూ ఊరెళ్ళారు.  సాయంత్రానికి వస్తామన్నారు . రాలేదు. రాత్రయ్యింది.  మామూలు గానే వండుకొని ,  తిని , పుస్తకాలు ముందేసుకొని కూర్చున్నాను . హాష్టలు బిల్డింగు కు ముందు స్టేజి ఉండేది.  అక్కడ లైటు వేశేవాళ్లు. అక్కడే చేరి  చదువుకుంటూ ఉండే వాళ్ళం.  అలాగే పుస్తకాలు తీసి  తిరగేస్తూ యదాలాపం గా బావి వైపు చూశాను. అంతే. హఠాత్తుగా  దెయ్యం  గుర్తుకొచ్చింది. నైట్ వాచ్ మన్ నారాయణ కూడ ఇంకా రాలేదు.  వస్తున్నాడేమో నని గేటు వంక చూస్తున్నాను.

                                               ఇంతలో గజ్జల చప్పుడు మెల్లగా విన్పించసాగింది .తల తిప్పిచూశాను. బావి దగ్గర  తెల్లచీర  కట్టుకొని, చేతిలో పసిపిల్ల ను ఎత్తుకొని బావి చుట్టు తిరుగతోంది ఒకావిడ. పసిపిల్ల ఏడుపు, గజ్జల శబ్దం వినపడుతూనే ఉంది. కొద్దిసేపు అలానే చూశాను. ఇంకా దగ్గర గా వస్తున్నట్లు భ్రాంతి.  దానితో  ఇంకా ఏవేవో  గుర్తుకొచ్చేస్తున్నాయి. ఆ మధ్య నే దయ్యం పట్టిందని తాళ్ళ తో కట్టి , కొట్టుకుంటూ తీసికెళ్ళిన  మా గది కి  ఎదురు గది లో ఉండే పత్రి హనుమంతరావు (ఇతనిది విస్సన్నపేట.  ఇప్పుడెక్కడున్నాడో. )  గుర్తుకొచ్చాడు.

                            అంతే . పుస్తకాలు ఒక ప్రక్కకు నెట్టి , ఒక్క ఉదుటున గేటు దాటి రోడ్డు ఎక్కాను. ఆ ఊళ్ళో ఒక టూరింగు టాకీస్ ఉండేది. రాత్రి 8.30 కి సినిమా వేశేవాడు. సినిమా నుంచి వచ్చే సరికి వాచ్ మన్ నారాయణ గురక పెట్టి నిద్రపోతున్నాడు. ప్రక్కనే నా చాప వేసుకున్నాను. అంతే తెల్లారింది. ఇది 73  లో మాట. అయితే  ఇదే అనుభవం అనుకోకుండా మరొకసారి ఎదురైంది.

                              పూలతోట సంగతి చెప్పాకదా.  పదహారు ఎకరాల పూలతోట. అన్ని రకాల పూలు అక్కడ కనువిందు చేసేవి.  మల్లెలు , విరజాజులు తోటలుండేవి . అప్పుడప్పుడూ దేవుడికి పూలదండలు గుచ్చడానికి ,  తోటలో పూలు కోయించడానికి   తోటమాలి గంగయ్య కు సహాయం గా ఉండేవాళ్ళం కాబట్టి పూలతోట లో మాకు కొంత చనువు ఏర్పడింది. ఫైనల్ పరీక్షలు వచ్చేసరికి చదువు లో పోటీ గుణం పెరిగి , వండుకోవడం కూడ మర్చిపోయి , రాత్రింబగళ్లు విపరీతం గా చదివేవాళ్ళం. దానితో శారీరకంగా బలహీనమై , దానితో పాటు మానసిక మైన ఒత్తిడి పెరగడం తో  పత్రి  హనుమంతరావు లాంటి వాళ్లు తయారయ్యే వాళ్లనేది తరువాత తెలిసిన విషయం. రాత్రి దయ్యం వచ్చి గుండెల మీద ఎక్కి కూర్చుందని , గాలిలో గిరగిర తిప్పి పడేసిందని ,చెవుల్లో గంటలు వినిపించాయని ఇలా చెప్పుకుంటుండే వాళ్లు  తిండి మానేసి బ్లాక్ టీలు తాగి , పడుకునే వాళ్ళు. సరే. అసలు విషయానికి వద్దాం.
                                 
                          ఫైనల్  పరీక్షలు నెలరోజులున్నాయనగా నేను , మిత్రుడు సోమశేఖరం  బిచాణా ను పూల తోటలోకి మార్చాం. రాత్రంతా  చదువుకోవడం , ఏ తెల్లవారు ఝామునో కునుకు తీయడం, ఇలా సాగుతోంది కాలం.  సబ్జక్టులు ఒక్కొక్కటి చివరకు వచ్చేస్తున్నాయి.  ఇంతలో ఒకరోజు సాయంత్రం ఏడింటికే తోటకు బయలుదేరాను నేను చదువుకోవడానికి . తర్వాత వస్తానన్నాడు మిత్రుడు శేఖరం. నేను వెళ్ళి రుబ్బడం మొదలుపెట్టాను. సబ్జక్టు లో పడితే టైం తెలియలేదు.  పదయ్యింది. ఒక్కసారి లేచి  మోటరు గది లో నుంచి  ఒళ్ళు విరుచుకుంటూ బైట కొచ్చాను. చుట్టూ చూశాను.
                           
                       అంతా చీకటి. పదహారు ఎకరాల పూలతోట . ఒక వైపు మల్లె ,మరొకవైపు విరజాజి  పొదలు .  ప్రక్కనే పెద్ద గాడిబావి. దానిలోంచి నీళ్లు లాగటానికి ఒక  పెద్దమోటరు. దాని కొక గది. ఆ గది లోనే  పుస్తకాలన్నీ పెట్టుకొని  మేము చదువుకుంటూ ఉండే వాళ్ళం.
             
                   దాని  బయట తాటాకులతో వేసిన చిన్నవసారా.  దాని క్రింద  ఇటుక, మట్టి తో కట్టిన అరుగు ఉండేది.  దానికి చిన్న కరెంటు బల్పు వేలాడుతూ, వెలుగుతోంది. ఆ అరుగు మీదే పగలంతా దేవుడికి పూలమాలలు కట్టడం ,  వచ్చేపోయే వాళ్ళ తో కబుర్లు కాకర కాయలాడటం చేస్తుంటాడు గంగయ్య కొడుకు శీను.
   
                        పది దాటిపోయింది . ఇంకా రాలేదు శేఖరం అనుకుంటూ పుస్తకం పట్టుకొని వచ్చి ఆ అరుగు మీద కూర్చున్నాను. చదువుకొనే రోజుల్లో  రాత్రి పది, పన్నెండు అంటే  లెక్కలోదికాదు. అందుకే  వస్తాడు లే అనుకుంటూ పరకాయించి గేటువైపు చూశాను.  గేటునుంచి ఒక కి.మీ దూరం ఉంటుంది నేనున్న మోటారు గది. ఎవ్వరూ కనపడ్డంలేదు. నెమ్మదిగా మనసు లో ఏదో అలజడి మొదలైంది . అక్కడ , అంత రాత్రి పూట నేను ఒంటరిగా ఉన్నానన్న విషయం  ఒక్కసారిగా గుర్తుకొచ్చింది. ఐదు సంవత్సరాలు గా తిరుగుతున్న ప్రదేశమే. అయినా ఎందుకో . ఏమిటోగా అన్పించింది. అలాగే కూర్చొని బావి మీదుగా గేటువైపు చూపు సారించాను.
               
                         దూరంగా ఎవరో వస్తున్నట్టు  రూపం కన్పిస్తోంది . వస్తున్నాడులే  అనుకోగానే మనసు కాస్త కుదుటపడింది.  బావి కి అవతలి వైపుకొచ్చాడు.  అంటే   నా మాట వినపడేంత దూరం.  “ ఏమిటయ్యా. ఇంత ఆలస్యం చేశావు …… అంటూ పలకరిస్తున్నాను నేను. కాని అతను బావి ప్రక్కనుండి తిరిగి గది దగ్గరకు రాకుండా బావి మీద నుండి  అడ్డం గా నడిచి రావడం మొదలు పెట్టాడు. ఆశ్చర్యం. బావి మధ్య లో శూన్యంలో నిలబడిపోయింది ఆ రూపం నా వైపుకు తిరిగి . ఆ వచ్చింది శేఖరం కాదనుకోవడానికి నాకు సెకను పట్టలేదు. మరి .....................

                   పొద్దున్నే పూలుకోయడానికి వచ్చిన గంగయ్య తట్టి లేపితే మెలుకవ వచ్చింది. అంతే.



                                 మన లోని భయం మనకు ఎన్ని రూపాలను కల్పించి, కన్పించి భయపెడుతుందో ఇప్పుడు  తలుచుకుంటే నవ్వొస్తుంది . ఇది నలభై సంవత్సరాల క్రిందటి మాట .

                        భయం లో ఉన్న వ్యక్తి కి తన  పెరటి లోని అరటిచెట్టే  జడల దెయ్యం లా కన్పిస్తుందన్న పెద్దలమాట ప్రత్యక్షరసత్యం.




******************************************************************************