Monday 1 August 2016

దేవుడు దిగొచ్చాడు

       
              
               దేవుడు దిగొచ్చాడు
                


       

                   తిరుమల కొండను కాలినడక ను ఎక్కడమంటే  ఒకప్పుడు ఎంత హుషారో. అది యూనివర్సిటీ లో ఉండే రోజుల్లో. మిత్రులతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ అలా సాగిపోతుంటే అలసట తెలిసేది కాదు.కాలము తెలిసేది కాదు.  కొండకు చేరుకొని క్యూలైన్లో తోసుకుంటూ స్వామిని దర్శించుకొని, రూపాయి కిచ్చే పెద్ద లడ్డూ ని తెచ్చుకొని , దగ్గర్లో ఉన్న పార్కులో కూర్చుని  చెరి సగం తినేసి మంచినీళ్లు తాగి, కాసేపు సొక్కుతీర్చుకొని మళ్లీ దర్శనానికి క్యూలైన్లో కి వెళ్లిపోయేవాళ్ళం.  బయటకొచ్చే సరికి రాత్రి పదో , పదకొండో అయ్యేది. అప్పుడు  ఆలయానికి ఎదురుగా ఉండే మహా మండపం మెట్లమీద కాసేపు కూర్చొని , నెమ్మదిగా క్రిందకు బయలుదేరే వాళ్ళం.
             
                చల్లని గాలి ఒంటికి తగులుతూ అలసట ను పోగొడ్తుంటే ,  తెల్లని వెన్నెలలో ఏడు కొండలు వింత వింత ఆకారాలలో  ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని  కల్గిస్తుంటే, కబుర్లు చెప్పుకుంటూ మెట్లు దిగుతూ , పరుగెత్తుతూ,మధ్య మధ్య లో  బండల మీద కాసేపు పడుకుంటూ ,  తీరిగ్గా హాస్టలు కు చేరే సరికి తెల్లతెల్లవారుతూ ఉండేది.  అది ఒక మధురానుభవం  గా మిగులుతుందని నేను అప్పుడనుకోలేదు. అనుకుంటే  అనుభూతి  ఏముంది. ఇది ఎప్పుడో ముఫైఐదు, నలభై సంవత్సరాల క్రిందటి మాట.
                      

                       తరువాత కూడ రెండు మూడు సార్లు కొండకు కాలిబాటను వెళ్లాను గాని  పెద్దగా  చెప్పుకోదగ్గ తేడా కన్పడలేదు.కాని అరవై నాలుగు కొచ్చిన తరవాత ఒక ఇరవై రోజుల క్రితం ఎందుకో కొండ ఎక్కాలని బుద్ది పుట్టింది. సరేలే.   నీ కొండకు నీవే రప్పించుకో అంటుంటారు కదా ఆ వేంకటేశ్వరుణ్ణి భక్తులు, అలాగే అనుకొని  నడుచు కుంటూ ఎక్కుదామని తీర్మానించుకున్నాను. 
                         
                       అనుకోవడం ఆలస్యం తొందర పెట్టేస్తాడు వేంకటేశ్వరుడు. భక్తులపై ఆయనకున్న అనురాగం అటువంటిది. క్రిందటి నెల తొమ్మిదో తారీఖు  (ఆరోజు దశమి శనివారం అని తరువాత తెలిసింది. )  మెట్లమార్గం బాగా రద్దీ గా ఉంది. మనిషి ని మనిషి రాసుకుంటూ ఎక్కుతున్నారు.
                    
                  


         
 

  ఆ రోజుఉదయం ఆరుగంటల కల్లా శ్రీమతి, కోడలు తో కలిసి  అలిపిరి చేరుకున్నాను. వాళ్ళిద్దరి కి ఉషారు లేకపోయినా  ఏదోలే పాపం అని   నాకు తోడు గా వచ్చారు. మథ్య లో ఎక్కలేకపోతే అనే సందేహం వచ్చింది వాళ్లకి.   నడక మార్గం లో ఇబ్బందు లొస్తే  ఆంబులెన్స్ కు ఫోన్ చేయమని అక్కడ బోర్డు లో ఉంది కదా. అని సర్ది చెప్పుకున్నారు.  వయసు తెచ్చే తిప్పలు  కదా అనుకున్నాను సరే. ఏవోఊహాపోహలతో బయలు దేరాం.
                       
                            మొత్తం  3550 మెట్లు. 9 కిలోమీటర్లు. ఇంతే కదా అనుకున్నాను బయలుదేరే టప్పుడు. ఎందుకంటే రోజూ  నాలుగున్నర కిలోమీటర్లు తక్కువ కాకుండా వాకింగ్ చేస్తాను కదా అని నా ధైర్యం . కాని ఈ నడవడానికి ఆ నడవడానికి సంబంథం లేదనే విషయం మెట్లు ఎక్కడం మొదలు పెట్టిన తరువాత కాని తెలియలేదు.
                        
                  7.50 కి వెయ్యి మెట్లు ఎక్కేశాం. అబ్బో ఫరవాలేదని పించింది. ఎందుకంటే ఐదువందలకి , వెయ్యి కి మెట్లమీద అంకెలు చెక్కారు. గబగబ  ఎక్కేవాళ్ళకు ఈ లెక్కలు అక్కరలేదు కాని  నాబోటి వాళ్ళ కు ఈ అవసరం ఉంటుంది ఇప్పుడు.
                    
                  ఇక ఆ తరువాత నడక నెమ్మదించింది. మథ్య మథ్య లో ఆంజనేయస్వామి వివిథ రూపాలలో, నరసింహస్వామి , దశావతారాలు  మెట్లమార్గం ప్రక్కన  కొలువు తీరి భక్తులను పల్కరిస్తుంటారు.  తినగలిగిన వాళ్ళకు అన్ని రకాల తినుబండారాలు , డ్రింకులు  కొల్లలుగా లభిస్తాయి.  ముంతకింద పప్పు , కోసిన మామిడికాయముక్కలు ఉప్పూ కారం చల్లి అమ్ముతుంటారు. ఇవి  తినే ప్రాయం అయిపోయింది కదా. 



                      అలా అనుకొని మంచి నీళ్ల బాటిలు  కొనుక్కొని   నడుస్తూ 1500 కు చేరుకున్నాము.మెట్ల పక్కన ఉన్న  అరుగుల మీద కూర్చుంటూ ,లేస్తూ ప్రయాణం సాగుతోంది. కొంతమంది వాంతులు చేసుకుంటుంటే మరికొంతమంది మథ్యవయస్కురాళ్ళు కాళ్లు బార జూపుకొని వత్తుకుంటూ ఏడుపు ను ఆపుకుంటున్నారు. గోవిందా, గోవిందా అంటూ  జారిపోతున్న ఉత్సాహాన్ని   కూడదీసుకుంటూ భక్తులు పైకి పరుగులు తీస్తున్నారు. పది పన్నెండేళ్ళ పసిపిల్లలు అవి కొని పెట్టమని , ఇవి కొని పెట్టమని మారాం చేస్తూ కాసేపు కూర్చోవడానికి ప్రయత్నిస్తున్నట్టున్నారు.
                          
                      ఒకరు ముందు ,ఒకరు వెనక ఎలాగోలా నెమ్మదిగా  1950 మెట్లు దాటగలిగాం. మన పెద్దవాళ్ళు    ఏదైనా కష్టమైన పని  పూర్తయితే ఆ పని అయ్యే సరికి తల్లీ ముగ్గురు చావయ్యింది..... అనో  .... దేవుడు దిగొచ్చాడనుకో  .... అనో   ...  అనేవాళ్ళు. ఈ దేవుడు దిగిరావడమేమిటో అప్పుడు తెలియలేదు కాని ఇప్పుడర్ధమైంది.
                 

                     
    1950 మెట్లు దాటేసరికి సమయం పదికి చేరింది . టిఫిన్ చెయ్యాలనిపించింది.ఇడ్లీ తిందామని  అక్కడే ఉన్న షాపు వాణ్ణి అడిగా.  కొంచెం ముందుకెడితే గోపురం వస్తుంది అక్కడ టిఫిన్లు దొరుకుతాయన్నాడు. సరే ఉత్సాహం తెచ్చుకొని అక్కడకు చేరి అల్పాహారం అయ్యిందనిపించాము. కాలిబాట భక్తులకు అక్కడ టోకెన్లు ఇస్తున్నారు కాని మాకు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఉండటం తో  బతుకు జీవుడా అని ముందుకు కదిలాం.
                          
                       టిఫిన్ చేసిన దగ్గర నుంచి కూర్చోవాలనే కోరిక పెరిగింది. నెమ్మదిగా కూర్చొంటూ , లేస్తూ మోకాళ్ళ పర్వతానికి చేరాం. కుర్రకారం తా మోకాళ్ళ తో మెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు. చూడ్డానికి ముచ్చటేసింది కాని మనం  కాళ్ల తో ఎక్కడమే గొప్ప అనే పరిస్థితి కదా.  ఎక్కుతూ , దిగుతూ మథ్యలో  ఘాటురోడ్డు లో   క్రిందకు  దిగి వేళ్ళే వాహనాలను చూస్తూ, ఆగుతూ , ఆగి మళ్ళీ బయలుదేరినప్పుడల్లా మోకాళ్లు సహకరించమంటుంటే  వాటికి మూవ్ స్ప్రే ని లంచం గా ఇస్తూ  నడుస్తున్నాం అన్నమాటే గాని ముందుకు వెళ్ళడం లేదు. చివరకు  3500 లకు చేరే సరికి  తోటి భక్తులందరి లోను ఉత్సాహం . వచ్చేశాం దగ్గరికి వచ్చేశాం. గోవిందా గోవిందా అంటూ పరుగులు పెడుతున్నట్టు న్నారు కాని నెమ్మదిగానే నడుస్తున్నారు.
                   
                




                               అదిగో అల్లదిగో హరివాసము అని అన్నమయ్య ఆనందం తో  నర్తించినట్లు దూరం గా కుంకుమరాశి , దాని ప్రక్కనే వెలుగుతున్న కర్పూర జ్యోతిని చూడగానే  ప్రాణం కుదుటపడింది. అదే 3550  వ మెట్టు. అంటే కొండ ఎక్కిన ఆనందం లో భక్తులు వెలిగించే  ఆనందజ్యోతి అది. ఆనందనిలయునకు అందించే  ఆనంద నీరాజనం అది . అది చూసిన భక్తులకు ఎంత ఆనందం కలుగు తుందో మాటల్లో చెప్పలేనిది. బిడ్డల కోసం ఎక్కే  కొత్తజంటల నుండి బిడ్డల ఆరోగ్యం కోరి ఎక్కే తల్లిదండ్రులు,తీరని కోర్కెలను విన్నవించుకుంటూ చేరుకునే ఆర్తుల వరకు ఎందరనీ ,ఏమనీ అందరి లోను ఆ సమయం లో ఆ కర్పూరజ్యోతిని  చూడగానే కలిగే ఆనందం  వర్ణనలకు అందనిది.
                       
              
                           ఆ విధం గా కొండపైకి చేరేసరికి పన్నెండుగంటలు దాటి పది నిముషాలైంది. ఈ వయసు లో కొండపైకి నడచి  చేరుకోవడం నా విషయం లో గొప్పే అనిపించింది.  అంతకు ముందు మోకాలి నొప్పి ఉండేది. కాని   ఈ నడక తో అది పోయింది . ఏమైనా గుడిలోకి వెళ్ళకముందే దేవుడు కన్పించాడని పించింది. మళ్ళీ ఎప్పుడూ ఇటువంటి కోరికలు కోరుకోకండి అని   నా ఇల్లాలు వెనకాల గొణుగుతూనే ఉంది. అయినా మన చేతులో ఏముంది. ఆయన ఎప్పుడు  ఏమి  చేయాలని నిర్ణయించు కుంటాడో అదే మన చేత చేయించుకుంటాడు . నాహం కర్తా. హరిరేవ కర్తా. అన్నారు కదా పెద్దలు.

                                           

                             ఓం నమో వేంకటేశాయ




**********************************************************************************