Wednesday 14 November 2012

మాతృమూర్తులారా! మంచిఅమ్మలు గా మెలగండి.


                                మాతృ మూర్తులారా.!




                 మంచి అమ్మలు గా   మెలగండి.  మమ్మీ లు  కాకండి.
                
             మాతృత్వం ఒక అపురూప వరం.అమ్మ అనిపించుకోవడం లోని తీయదనాన్ని  సృష్టి లో మరి దేనితోను మనం పోల్చలేము . అమ్మదనం లోని కమ్మ  దనాన్ని గురించి ఎందరో కవులు ఎన్నోరకాలుగా వర్ణించినా తనివి తీరని మాధుర్యం దానిది. అమ్మను మించిన అమ్మ ఉన్నదే అంటాడు మహాకవి శ్రీనాథుడు. ఆకాశం ఎలా ఉంటుంది అంటే ఆకాశం లాగానే ఉంటుంది.సముద్రం ఎలా ఉంటుంది అంటే సముద్రం లానే ఉంటుంది . రామ రావణ యుద్ధం  రామరావణయుద్ధం లాగానే ఉంటుంది. అలాగే అమ్మ ను పోల్చడానికి ఉపమానాలు  లేవు.అమ్మ  అంటే అమ్మ లాగానే ఉంటుంది.

                   కాని ఆధునిక యుగంలో  ఆర్ధికసంబంధాలే  అనుబంధాలను శాసిస్తున్నాయి. ఆత్మీయత. అనురాగాలు ఆకాశపుష్పాలై పోతున్నాయి. బిడ్డల ఎదుగుదల కోసం అమ్మా నాన్నలు  పడిన కష్టాలు , చేసిన త్యాగాలు, వారి బాధ్యతలు గానే మిగిలి పోతున్నాయి.ఈ నాటి కొడుకులు, కూతుళ్ళు ఒకనాటికి అమ్మా నాన్నలే నన్న విషయాన్ని  యువతరం గుర్తుంచుకోవాలి.  అమ్మ నాన్నలకు అన్నం పెట్టడానికి  ఆలోచించే పరిస్ధితి వస్తోంది. వీటన్నింటికీ కారణాలు ఆర్ధిక లావాదేవీలే.అందుకే మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమోనమ: అని చేతులెత్తి నమస్కరించారు ధనలక్ష్మి కి జగద్గురువు ఆది శంకరాచార్యులవారు.

           
         నేటి కాలంలో ఉద్యోగం పురుషలక్షణం అనే పాతమాట చెరిగి పోయి ఉద్యోగం స్త్రీ లక్షణం  చ అనే మాట ఆచరణీయమౌతోంది. నస్త్రీ స్వాతంత్ర్య మర్హతి అనే మాట తుడిచి వేయబడింది. విద్యా.ఉద్యోగ అవకాశాలు ఆడపడుచు లందరికీ అందుబాటులోకి వచ్చాయి.  మగవారి  తో  సమానంగా ఆడవారు అన్నిరంగాల లోను అభివృధ్ధి సాధిస్తున్నారు.కొన్ని రంగాల్లో ఆడపడచులే ముందున్నారంటే కూడ ఆశ్చర్యం లేదు.
                       కాని మగవానికి చేత కానిది  స్ర్తీ జాతి కి మాత్రమే సాథ్యమయేది  అమ్మదనం. అది భగవంతుడు స్త్రీ మూర్తుల కిచ్చిన వరం. అందుకనే వరాలిచ్చెడి ఇలవేల్పులను అమ్మా అంటాము. ఆకలి గొన్న వేళ పట్టెడన్నం పెట్టిన మహాతల్లి ని అమ్మా అని నోరారా పిలుస్తాం. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ అంటూ ఆ అమ్మను తలచుకొని  పరవశించిపోయాడు భక్తకవి పోతన . 
                          
                        
         విచిత్రమేమిటంటే  ఆధునిక యుగంలో ఇంటిపని, ఉద్యోగం రెండు చేసుకోవడానికి ఇబ్బంది పడే ఉద్యోగినులైన గృహిణులు  పనిమనుషులను
పెట్టుకుంటున్నారు.అది తప్పనిసరి. కాని ఇంటితో పాటు  పుట్టిన ఒక్కనలుసు  బాద్యతను కూడ వాళ్లకే అప్ప చెప్పేస్తున్నారు.   టాయిలెట్ కి తీసుకెళ్ళడం,  స్నానం చేయించడం , స్కూలు బస్ దగ్గరకు తీసుకెళ్లడం, తీసుకురావడం అన్నంపెట్టడం, ఆడించడం, నిద్ర పుచ్చడం అన్నీ వాళ్లే చూసుకుంటున్నారు. 
                 
         ఉద్యోగం,ఒత్తిళ్ళు, అలసట, శ్రమ , ఇవన్నీ అంగీకరించవలసిన విషయాలే. అయితే వాటితో పాటు కన్నబిడ్డకు తల్లిప్రేమ అందించడం కూడ ముఖ్యమేకదా.! కాసేపు అమ్మతో కబుర్లు చెప్పాలనో,అమ్మపక్కలో పడుకోవాలనో, అమ్మ ఎత్తుకొని లాలించి అన్నంపెట్టాలనో ఆ పసిప్రాణానికి అనిపించదా!. అందరి అమ్మల్లాగానే తన అమ్మ కూడ తన అవసరాలు చూస్తూ తనతోనే ఉండాలని ఆ పసిప్రాణం ఎంతగా కోరుకుంటుందో ఒక్కసారి ఆలోచించండి. మీరు కష్టపడేది వారి కోసమే. కాని ఎప్పటి దాని కోసమో ఆచిన్నారులకు ఇప్పుడు లభించే ఆనందాన్ని దూరం చేస్తారా.?

            ఉద్యోగాలు చేయండి. ఉన్నతిని సాధించండి .కాని కాస్త తీరిక చేసుకొని బిడ్డలకు అమ్మదనాన్ని పంచండి. ఇదికూడ ఉద్యోగం లో ఒకబాధ్యత గా భావిస్తే భారం అనిపించదు.  అమ్మ వళ్లో పెరిగిన కన్నయ్య లు భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు. మంచి సమాజాన్ని స్ధాపిస్తారు. కనీసం ఆరేడేళ్లు వచ్చేవరకన్నా మీరు వాళ్లను చూసుకుంటే పెద్దయిన తరువాత వాళ్లు మిమ్మల్ని
చూసుకునేఅవకాశం ఉంది. వృద్ధాశ్రమాల అవసరం రాకపోవచ్చు. 
              ఉద్యోగినులందరూ ఒకేరకంగా ఉండరు కదా! ఇప్పటికే ఇలా ఉంటున్న  ఆడపడుచు లందరికీ ఆత్మీయ ఆశీస్సులు.ఈ మాటలు ప్రేమతో చెప్పినవే కాని విమర్శించడం కానేకాదు. ఎందుకంటే నేను ఈ మధ్యన    ఒక మూడేళ్ల బాబు ని బాబు నీకేంకావాలి అని అడిగాను. ఎందుకంటే  ఏ బిస్కట్టో , చాక్లెట్టో ,అడిగితే కొని పెట్టేసి మంచి వాణ్ణి అనిపంచుకోవాలని నా ఆశ. కాని వాడు ఏమిఅడిగాడో తెలుసా నాకు పది అమ్మలు కావాలి అన్నాడు.నాకు మాట రాలేదు. వాడి ఆ మాటలే నాయీ మాటలకు ప్రేరణ. వాడిమాటల్లో వాడి అమ్మమీద వాడికెంత ప్రేమ ఉందో బయటపడింది. ఉద్యేగం చేసే  వాళ్ల అమ్మ ఎప్పుడోనిద్ర పోయే సమయానికి వస్తుంది . పొద్దున్నే వీడు ప్లేస్కూలుకి వెళ్లొచ్చేసరికి వెళ్లిపోతుంది. అందుకని వాడి చిన్నబుర్ర కు ఈ ఆలోచన తట్టింది. ఒకపది అమ్మలుంటే ఒకరు కాకపోతే ఒకరితో ఆడుకోవచ్చు అనుకొనుంటాడు. దయచేసి ఇటువంటి ఆలోచనలు ఫిల్లల్లో  రానీయకుండా చూడాల్సినబాధ్యత మనదే కదా.!


************  యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా:  ***********