Thursday 21 March 2013

ఒక దైవోపహతుని ఆక్రందన


ఒక   దైవోపహతుని ఆక్రందన


ప్రతిసారి నన్ను ఘోరంగా హింసించి అనుభవిస్తున్నావు
 అయినా నిన్ను వదల్లేక పోతున్నాను
ఛీ కొట్టి పొమ్మంటే ఇంకా నిన్ను దగ్గరగా హత్తుకుంటున్నాను
రక్షించేవాడే నాశనం చేస్తుంటే నేనెవరితో చెప్పుకుంటాను
నీవేతప్ప ఇత:పరం బెరుగనని ప్రవర్తించిన నన్ను పరీక్షలకులోను చేస్తున్నావు
ఇవేనా?   ఇంత కఠినం గానా!
 అన్నీ ఇచ్చినట్లే ఇచ్చావు అంతలో లాగేసుకున్నావు
 నీవే నా దేవుడవని అందరి ముందు గొప్పగా చెప్పుకొనే నాకు
వారిముందే తలవంపులు కలిగించావు
నిన్నునమ్ముకున్న నేను నీచే చెరచబడి  దిగులుగా వీథి లో నిలబడితే
 నీ కళ్లు చల్లబడ్డాయా?         ఇదేం ఘోరం!
 అందరూ నన్ను జాలిగా చూస్తుంటే నీకేం ఆనందం లభించింది ?
 నీ భక్తుడికి జరిగిన ఈ అవమానం నీకు ఆనందాన్నెలా యిచ్చింది ?
కర్మ నే నమ్ముకుంటే నిన్ను ఎత్తుకోవడం ఎందుకు  ?
 బాధలు కలిగినపుడల్లా నీ నామ స్మరణ చేయడమెందుకు?
అంతా భ్రాంతేనా?
జరగవలసినది జరగక మాననప్పుడు
జరిగినదాన్నితట్టుకునే గుండెధైర్యమన్నా నీ వివ్వాలి కదా!
అదికూడ లేకపోతే ఆస్తికత్వానికి అర్ధమేమిటి ?
 స్వామీ! అలిగావా? బాధ కలిగినప్పుడు సమాధానం కోసం అడక్కపోతే
 ఆపదమొక్కులవాడనే బిరుదు నీకెందుకయ్యా ?
అన్నిబాధలు నాకే కలిగిస్తూ- ఇంకా వీడెలా ఉన్నాడా! అని
 అప్పుడప్పుడూ చూస్తున్నావు కదూ !
 కానీలే స్వామీ! నాదురదృష్టం అది. ఎవరినేమి అనగలను
 ఆదుకోవాల్సినవాడే ఆడుకొంటుంటే ...  ఇంకా ఎవరు కాపాడుతాడు ?
కన్నతండ్రే బిడ్డను వీథిలో పడేస్తే కాదనేవాడెవడుంటాడు ... అది వాడి ఖర్మ కాకపోతే
 అదే పని నువ్వు చేశావు అయినా నీపాదాలను విడువను
ఇక్కడే ఈ శరీరం రాలి పోవాలి .. అదే నా కోరిక .
*******************************************************************