Monday 1 August 2016

దేవుడు దిగొచ్చాడు

       
              
               దేవుడు దిగొచ్చాడు
                


       

                   తిరుమల కొండను కాలినడక ను ఎక్కడమంటే  ఒకప్పుడు ఎంత హుషారో. అది యూనివర్సిటీ లో ఉండే రోజుల్లో. మిత్రులతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ అలా సాగిపోతుంటే అలసట తెలిసేది కాదు.కాలము తెలిసేది కాదు.  కొండకు చేరుకొని క్యూలైన్లో తోసుకుంటూ స్వామిని దర్శించుకొని, రూపాయి కిచ్చే పెద్ద లడ్డూ ని తెచ్చుకొని , దగ్గర్లో ఉన్న పార్కులో కూర్చుని  చెరి సగం తినేసి మంచినీళ్లు తాగి, కాసేపు సొక్కుతీర్చుకొని మళ్లీ దర్శనానికి క్యూలైన్లో కి వెళ్లిపోయేవాళ్ళం.  బయటకొచ్చే సరికి రాత్రి పదో , పదకొండో అయ్యేది. అప్పుడు  ఆలయానికి ఎదురుగా ఉండే మహా మండపం మెట్లమీద కాసేపు కూర్చొని , నెమ్మదిగా క్రిందకు బయలుదేరే వాళ్ళం.
             
                చల్లని గాలి ఒంటికి తగులుతూ అలసట ను పోగొడ్తుంటే ,  తెల్లని వెన్నెలలో ఏడు కొండలు వింత వింత ఆకారాలలో  ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని  కల్గిస్తుంటే, కబుర్లు చెప్పుకుంటూ మెట్లు దిగుతూ , పరుగెత్తుతూ,మధ్య మధ్య లో  బండల మీద కాసేపు పడుకుంటూ ,  తీరిగ్గా హాస్టలు కు చేరే సరికి తెల్లతెల్లవారుతూ ఉండేది.  అది ఒక మధురానుభవం  గా మిగులుతుందని నేను అప్పుడనుకోలేదు. అనుకుంటే  అనుభూతి  ఏముంది. ఇది ఎప్పుడో ముఫైఐదు, నలభై సంవత్సరాల క్రిందటి మాట.
                      

                       తరువాత కూడ రెండు మూడు సార్లు కొండకు కాలిబాటను వెళ్లాను గాని  పెద్దగా  చెప్పుకోదగ్గ తేడా కన్పడలేదు.కాని అరవై నాలుగు కొచ్చిన తరవాత ఒక ఇరవై రోజుల క్రితం ఎందుకో కొండ ఎక్కాలని బుద్ది పుట్టింది. సరేలే.   నీ కొండకు నీవే రప్పించుకో అంటుంటారు కదా ఆ వేంకటేశ్వరుణ్ణి భక్తులు, అలాగే అనుకొని  నడుచు కుంటూ ఎక్కుదామని తీర్మానించుకున్నాను. 
                         
                       అనుకోవడం ఆలస్యం తొందర పెట్టేస్తాడు వేంకటేశ్వరుడు. భక్తులపై ఆయనకున్న అనురాగం అటువంటిది. క్రిందటి నెల తొమ్మిదో తారీఖు  (ఆరోజు దశమి శనివారం అని తరువాత తెలిసింది. )  మెట్లమార్గం బాగా రద్దీ గా ఉంది. మనిషి ని మనిషి రాసుకుంటూ ఎక్కుతున్నారు.
                    
                  


         
 

  ఆ రోజుఉదయం ఆరుగంటల కల్లా శ్రీమతి, కోడలు తో కలిసి  అలిపిరి చేరుకున్నాను. వాళ్ళిద్దరి కి ఉషారు లేకపోయినా  ఏదోలే పాపం అని   నాకు తోడు గా వచ్చారు. మథ్య లో ఎక్కలేకపోతే అనే సందేహం వచ్చింది వాళ్లకి.   నడక మార్గం లో ఇబ్బందు లొస్తే  ఆంబులెన్స్ కు ఫోన్ చేయమని అక్కడ బోర్డు లో ఉంది కదా. అని సర్ది చెప్పుకున్నారు.  వయసు తెచ్చే తిప్పలు  కదా అనుకున్నాను సరే. ఏవోఊహాపోహలతో బయలు దేరాం.
                       
                            మొత్తం  3550 మెట్లు. 9 కిలోమీటర్లు. ఇంతే కదా అనుకున్నాను బయలుదేరే టప్పుడు. ఎందుకంటే రోజూ  నాలుగున్నర కిలోమీటర్లు తక్కువ కాకుండా వాకింగ్ చేస్తాను కదా అని నా ధైర్యం . కాని ఈ నడవడానికి ఆ నడవడానికి సంబంథం లేదనే విషయం మెట్లు ఎక్కడం మొదలు పెట్టిన తరువాత కాని తెలియలేదు.
                        
                  7.50 కి వెయ్యి మెట్లు ఎక్కేశాం. అబ్బో ఫరవాలేదని పించింది. ఎందుకంటే ఐదువందలకి , వెయ్యి కి మెట్లమీద అంకెలు చెక్కారు. గబగబ  ఎక్కేవాళ్ళకు ఈ లెక్కలు అక్కరలేదు కాని  నాబోటి వాళ్ళ కు ఈ అవసరం ఉంటుంది ఇప్పుడు.
                    
                  ఇక ఆ తరువాత నడక నెమ్మదించింది. మథ్య మథ్య లో ఆంజనేయస్వామి వివిథ రూపాలలో, నరసింహస్వామి , దశావతారాలు  మెట్లమార్గం ప్రక్కన  కొలువు తీరి భక్తులను పల్కరిస్తుంటారు.  తినగలిగిన వాళ్ళకు అన్ని రకాల తినుబండారాలు , డ్రింకులు  కొల్లలుగా లభిస్తాయి.  ముంతకింద పప్పు , కోసిన మామిడికాయముక్కలు ఉప్పూ కారం చల్లి అమ్ముతుంటారు. ఇవి  తినే ప్రాయం అయిపోయింది కదా. 



                      అలా అనుకొని మంచి నీళ్ల బాటిలు  కొనుక్కొని   నడుస్తూ 1500 కు చేరుకున్నాము.మెట్ల పక్కన ఉన్న  అరుగుల మీద కూర్చుంటూ ,లేస్తూ ప్రయాణం సాగుతోంది. కొంతమంది వాంతులు చేసుకుంటుంటే మరికొంతమంది మథ్యవయస్కురాళ్ళు కాళ్లు బార జూపుకొని వత్తుకుంటూ ఏడుపు ను ఆపుకుంటున్నారు. గోవిందా, గోవిందా అంటూ  జారిపోతున్న ఉత్సాహాన్ని   కూడదీసుకుంటూ భక్తులు పైకి పరుగులు తీస్తున్నారు. పది పన్నెండేళ్ళ పసిపిల్లలు అవి కొని పెట్టమని , ఇవి కొని పెట్టమని మారాం చేస్తూ కాసేపు కూర్చోవడానికి ప్రయత్నిస్తున్నట్టున్నారు.
                          
                      ఒకరు ముందు ,ఒకరు వెనక ఎలాగోలా నెమ్మదిగా  1950 మెట్లు దాటగలిగాం. మన పెద్దవాళ్ళు    ఏదైనా కష్టమైన పని  పూర్తయితే ఆ పని అయ్యే సరికి తల్లీ ముగ్గురు చావయ్యింది..... అనో  .... దేవుడు దిగొచ్చాడనుకో  .... అనో   ...  అనేవాళ్ళు. ఈ దేవుడు దిగిరావడమేమిటో అప్పుడు తెలియలేదు కాని ఇప్పుడర్ధమైంది.
                 

                     
    1950 మెట్లు దాటేసరికి సమయం పదికి చేరింది . టిఫిన్ చెయ్యాలనిపించింది.ఇడ్లీ తిందామని  అక్కడే ఉన్న షాపు వాణ్ణి అడిగా.  కొంచెం ముందుకెడితే గోపురం వస్తుంది అక్కడ టిఫిన్లు దొరుకుతాయన్నాడు. సరే ఉత్సాహం తెచ్చుకొని అక్కడకు చేరి అల్పాహారం అయ్యిందనిపించాము. కాలిబాట భక్తులకు అక్కడ టోకెన్లు ఇస్తున్నారు కాని మాకు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఉండటం తో  బతుకు జీవుడా అని ముందుకు కదిలాం.
                          
                       టిఫిన్ చేసిన దగ్గర నుంచి కూర్చోవాలనే కోరిక పెరిగింది. నెమ్మదిగా కూర్చొంటూ , లేస్తూ మోకాళ్ళ పర్వతానికి చేరాం. కుర్రకారం తా మోకాళ్ళ తో మెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు. చూడ్డానికి ముచ్చటేసింది కాని మనం  కాళ్ల తో ఎక్కడమే గొప్ప అనే పరిస్థితి కదా.  ఎక్కుతూ , దిగుతూ మథ్యలో  ఘాటురోడ్డు లో   క్రిందకు  దిగి వేళ్ళే వాహనాలను చూస్తూ, ఆగుతూ , ఆగి మళ్ళీ బయలుదేరినప్పుడల్లా మోకాళ్లు సహకరించమంటుంటే  వాటికి మూవ్ స్ప్రే ని లంచం గా ఇస్తూ  నడుస్తున్నాం అన్నమాటే గాని ముందుకు వెళ్ళడం లేదు. చివరకు  3500 లకు చేరే సరికి  తోటి భక్తులందరి లోను ఉత్సాహం . వచ్చేశాం దగ్గరికి వచ్చేశాం. గోవిందా గోవిందా అంటూ పరుగులు పెడుతున్నట్టు న్నారు కాని నెమ్మదిగానే నడుస్తున్నారు.
                   
                




                               అదిగో అల్లదిగో హరివాసము అని అన్నమయ్య ఆనందం తో  నర్తించినట్లు దూరం గా కుంకుమరాశి , దాని ప్రక్కనే వెలుగుతున్న కర్పూర జ్యోతిని చూడగానే  ప్రాణం కుదుటపడింది. అదే 3550  వ మెట్టు. అంటే కొండ ఎక్కిన ఆనందం లో భక్తులు వెలిగించే  ఆనందజ్యోతి అది. ఆనందనిలయునకు అందించే  ఆనంద నీరాజనం అది . అది చూసిన భక్తులకు ఎంత ఆనందం కలుగు తుందో మాటల్లో చెప్పలేనిది. బిడ్డల కోసం ఎక్కే  కొత్తజంటల నుండి బిడ్డల ఆరోగ్యం కోరి ఎక్కే తల్లిదండ్రులు,తీరని కోర్కెలను విన్నవించుకుంటూ చేరుకునే ఆర్తుల వరకు ఎందరనీ ,ఏమనీ అందరి లోను ఆ సమయం లో ఆ కర్పూరజ్యోతిని  చూడగానే కలిగే ఆనందం  వర్ణనలకు అందనిది.
                       
              
                           ఆ విధం గా కొండపైకి చేరేసరికి పన్నెండుగంటలు దాటి పది నిముషాలైంది. ఈ వయసు లో కొండపైకి నడచి  చేరుకోవడం నా విషయం లో గొప్పే అనిపించింది.  అంతకు ముందు మోకాలి నొప్పి ఉండేది. కాని   ఈ నడక తో అది పోయింది . ఏమైనా గుడిలోకి వెళ్ళకముందే దేవుడు కన్పించాడని పించింది. మళ్ళీ ఎప్పుడూ ఇటువంటి కోరికలు కోరుకోకండి అని   నా ఇల్లాలు వెనకాల గొణుగుతూనే ఉంది. అయినా మన చేతులో ఏముంది. ఆయన ఎప్పుడు  ఏమి  చేయాలని నిర్ణయించు కుంటాడో అదే మన చేత చేయించుకుంటాడు . నాహం కర్తా. హరిరేవ కర్తా. అన్నారు కదా పెద్దలు.

                                           

                             ఓం నమో వేంకటేశాయ




**********************************************************************************

Thursday 23 October 2014

విశాఖ నేస్తమా !

                    

                                విశాఖ నేస్తమా !





                              మిన్ను విఱిగి మీద పడ్డట్టు
                             పెనుతుపాను విఱుచుక పడ్తే
                            చలించక నిలిచిన నిన్ను చూచి
                            విస్తుపోయిన  ఈ  విశ్వమంతా
                            నీ  స్థైర్యానికి జేజేలు పలుకు తోంది.

                           నీకెందుకింక  భయం ?
                            నీ తోనే మేమున్నాం

                         నువ్వూ నేను నేనూ నువ్వూ
                          నువ్వే నేను  నేనే నువ్వు
                          కలిసి మనం ఒకే జనం

                         మనం మనం జనం మనం
                        పదంపదం  కలిపి  నడుద్ద్దాం  కలిసి శ్రమిద్దాం

                        మరచిపోలేని  ఆనాటి భయాలను ,బాధలను
                        మరుగున తోసేసి, సంద్రం లోకి విసిరేద్దాం
                        ఒకరి కొకరు బాసటయై, ధైర్యంగా నిలుద్దాం.

                        హుద్ హుద్ నే ఎదుర్కొన్న మీకు
                        మిగిలిన భయాలన్నీ చిరుగాలులే సుమా!
                        ధైర్యంగా ఉండు మిత్రమా!

                         దేశమంతా నీ వైపే చూస్తోంది.
                        కష్టాల్లో ఉన్న ఆప్తున్ని అక్కున చేర్చుకోవడానికి
                         ముందు కొస్తోంది .

                      ఇంటి ముందు  ఈ దీపావళి కి దీపం మాత్రం  వెలిగించు.
                      బాధలనే చీకట్లను ఎద నుంచి తరిమి కొట్టు

                       వచ్చే దీపావళి ని పచ్చని మన విశాఖ లో
                       బంధువుల మథ్య పండుగలా జరుపుకుందాం.
                       మారుతుంది కాలం .  మానుతుంది  గాయం
                                       
                                            ***


Friday 13 June 2014

దెయ్యం వచ్చిన రాత్రి

                                       దెయ్యం వచ్చిన రాత్రి
                        
                     కొన్ని విషయాలు తలుచుకుంటే నవ్వొస్తాయి. మరికొన్ని చెప్పుకుంటే  ఎంతో హాయి నిస్తాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది రెండవది.
                 
                 అవి నేను ఆగిరిపల్లి కాలేజీ లో చదువుకొనే రోజులు.  మా కాలేజీ కి ఆనుకొని  దేవుడి పూలతోట ఉండేది. ఆగిరిపల్లి శ్రీ శోభనాచల లక్ష్మీ నరసింహ స్వామి వెలసిన దివ్యక్షేత్రం కదా . ఆయనదే  ఈ పూల తోట.   ప్రతిరోజు  శ్రీ స్వామి వారి పూజ కు పూలు, పూలదండలు ఇక్కడ నుంచే వెళుతుండేవి. ఆ తోటమాలి పేరు గంగయ్య.
                                           నేను సెలవల్లో కూడ ఇంటికి వెళ్లకుండా హాష్టల్లోనే ఉండేవాడిని. వండుకోవడం అలవాటే కాబట్టి ఇబ్బంది అనిపించేది కాదు . సెలవలకు ఇంటికి వెళితే మాది ఉమ్మడి కుటుంబం కాబట్టి  మేనత్తల పిల్లలు , బాబాయి పిల్లలు సెలవలకొచ్చి ఇంటినిండా ఉంటారు  చదువుకోవడానికి వీలుండదని నేను చెప్పుకోవడం  మా తాతగారు కూడ ఒప్పుకోవడం తో  సెలవల్లో కూడ  హాష్టల్లో ఉండే అవకాశం లభించింది. సరే అసలు కథ ఇక్కడే మొదలైంది.
              
                            ఒకే  ఆవరణ లో  కాలేజి భవనం , రెండు హాష్టలు భవనాలు ఉండేవి.చుట్టూ పది, పన్నెండు ఎకరాల ఖాళీ స్ధలం ఉండేది.  హాష్టలు అంటే కేవలం  ఉండటానికి గదులిచ్చేవారు. గదికి ఇద్దరు ముగ్గురం ఉంటూ వండుకొని తింటుండే వాళ్లం. తిండి సరిగా ఉన్నా లేకపోయినా చదువులో మాత్రం విపరీతమైన పోటీ ఉండేది. నైట్అవుట్ , బ్లాక్ టీ అనే పదాలు రెండవ సంవత్సరం నుంచే అలవాటై పోయేవి.

                                          అదేమిటో గాని కరెంటు పోయిన రాత్రుల్లో అందరం ఒక చోట చేరి చెప్పుకొనే కబుర్లలో దయ్యం కధలే ఎక్కువుండేవి. మా హాష్టల్ కి నైరుతి లో ఒక పెద్ద  మోట బావి ఉండేది. మాకే  కాక చుట్టుప్రక్కల వాళ్ళకు కూడ ఆ బావి నీళ్లే ఆధారం. అయితే ఈ బావిలో ఎవరెవరో దూకి చచ్చిపోయారని ,వాళ్ళలో బాలింతరాళ్లు , పెళ్ళికూతుళ్లు కూడ ఉన్నారని , రాత్రి పూట గజ్జల చప్పుడు ,  పసి పిల్ల ఏడుపు వినిపిస్తుందని   మా సీనియర్లు భయపెడుతుండేవాళ్ళు. అవి ఊసు పోక కబుర్లయినా  అప్పుడప్పుడు ఒంటరిగా రాత్రి పూట బావి దగ్గరకు వెళ్లినపుడో , హాష్టల్లో ఒంటరి గా ఉన్నప్పుడో గుర్తుకొచ్చి భయపెడుతుండేవి.  

                                అయితే సెలవల్లో కూడ అక్కడే ఉండి చదువుకోవడానికి నా లాగానే ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్లు.  పగలంతా  వేరే వేరే చదువుకున్నా రాత్రి వేళ పడుకునే సమయానికి మాత్రం ఒకచోటు కి చేరేవాళ్లం. ఒకసారి అనుకోకుండా మిగతావాళ్ళిద్దరూ ఊరెళ్ళారు.  సాయంత్రానికి వస్తామన్నారు . రాలేదు. రాత్రయ్యింది.  మామూలు గానే వండుకొని ,  తిని , పుస్తకాలు ముందేసుకొని కూర్చున్నాను . హాష్టలు బిల్డింగు కు ముందు స్టేజి ఉండేది.  అక్కడ లైటు వేశేవాళ్లు. అక్కడే చేరి  చదువుకుంటూ ఉండే వాళ్ళం.  అలాగే పుస్తకాలు తీసి  తిరగేస్తూ యదాలాపం గా బావి వైపు చూశాను. అంతే. హఠాత్తుగా  దెయ్యం  గుర్తుకొచ్చింది. నైట్ వాచ్ మన్ నారాయణ కూడ ఇంకా రాలేదు.  వస్తున్నాడేమో నని గేటు వంక చూస్తున్నాను.

                                               ఇంతలో గజ్జల చప్పుడు మెల్లగా విన్పించసాగింది .తల తిప్పిచూశాను. బావి దగ్గర  తెల్లచీర  కట్టుకొని, చేతిలో పసిపిల్ల ను ఎత్తుకొని బావి చుట్టు తిరుగతోంది ఒకావిడ. పసిపిల్ల ఏడుపు, గజ్జల శబ్దం వినపడుతూనే ఉంది. కొద్దిసేపు అలానే చూశాను. ఇంకా దగ్గర గా వస్తున్నట్లు భ్రాంతి.  దానితో  ఇంకా ఏవేవో  గుర్తుకొచ్చేస్తున్నాయి. ఆ మధ్య నే దయ్యం పట్టిందని తాళ్ళ తో కట్టి , కొట్టుకుంటూ తీసికెళ్ళిన  మా గది కి  ఎదురు గది లో ఉండే పత్రి హనుమంతరావు (ఇతనిది విస్సన్నపేట.  ఇప్పుడెక్కడున్నాడో. )  గుర్తుకొచ్చాడు.

                            అంతే . పుస్తకాలు ఒక ప్రక్కకు నెట్టి , ఒక్క ఉదుటున గేటు దాటి రోడ్డు ఎక్కాను. ఆ ఊళ్ళో ఒక టూరింగు టాకీస్ ఉండేది. రాత్రి 8.30 కి సినిమా వేశేవాడు. సినిమా నుంచి వచ్చే సరికి వాచ్ మన్ నారాయణ గురక పెట్టి నిద్రపోతున్నాడు. ప్రక్కనే నా చాప వేసుకున్నాను. అంతే తెల్లారింది. ఇది 73  లో మాట. అయితే  ఇదే అనుభవం అనుకోకుండా మరొకసారి ఎదురైంది.

                              పూలతోట సంగతి చెప్పాకదా.  పదహారు ఎకరాల పూలతోట. అన్ని రకాల పూలు అక్కడ కనువిందు చేసేవి.  మల్లెలు , విరజాజులు తోటలుండేవి . అప్పుడప్పుడూ దేవుడికి పూలదండలు గుచ్చడానికి ,  తోటలో పూలు కోయించడానికి   తోటమాలి గంగయ్య కు సహాయం గా ఉండేవాళ్ళం కాబట్టి పూలతోట లో మాకు కొంత చనువు ఏర్పడింది. ఫైనల్ పరీక్షలు వచ్చేసరికి చదువు లో పోటీ గుణం పెరిగి , వండుకోవడం కూడ మర్చిపోయి , రాత్రింబగళ్లు విపరీతం గా చదివేవాళ్ళం. దానితో శారీరకంగా బలహీనమై , దానితో పాటు మానసిక మైన ఒత్తిడి పెరగడం తో  పత్రి  హనుమంతరావు లాంటి వాళ్లు తయారయ్యే వాళ్లనేది తరువాత తెలిసిన విషయం. రాత్రి దయ్యం వచ్చి గుండెల మీద ఎక్కి కూర్చుందని , గాలిలో గిరగిర తిప్పి పడేసిందని ,చెవుల్లో గంటలు వినిపించాయని ఇలా చెప్పుకుంటుండే వాళ్లు  తిండి మానేసి బ్లాక్ టీలు తాగి , పడుకునే వాళ్ళు. సరే. అసలు విషయానికి వద్దాం.
                                 
                          ఫైనల్  పరీక్షలు నెలరోజులున్నాయనగా నేను , మిత్రుడు సోమశేఖరం  బిచాణా ను పూల తోటలోకి మార్చాం. రాత్రంతా  చదువుకోవడం , ఏ తెల్లవారు ఝామునో కునుకు తీయడం, ఇలా సాగుతోంది కాలం.  సబ్జక్టులు ఒక్కొక్కటి చివరకు వచ్చేస్తున్నాయి.  ఇంతలో ఒకరోజు సాయంత్రం ఏడింటికే తోటకు బయలుదేరాను నేను చదువుకోవడానికి . తర్వాత వస్తానన్నాడు మిత్రుడు శేఖరం. నేను వెళ్ళి రుబ్బడం మొదలుపెట్టాను. సబ్జక్టు లో పడితే టైం తెలియలేదు.  పదయ్యింది. ఒక్కసారి లేచి  మోటరు గది లో నుంచి  ఒళ్ళు విరుచుకుంటూ బైట కొచ్చాను. చుట్టూ చూశాను.
                           
                       అంతా చీకటి. పదహారు ఎకరాల పూలతోట . ఒక వైపు మల్లె ,మరొకవైపు విరజాజి  పొదలు .  ప్రక్కనే పెద్ద గాడిబావి. దానిలోంచి నీళ్లు లాగటానికి ఒక  పెద్దమోటరు. దాని కొక గది. ఆ గది లోనే  పుస్తకాలన్నీ పెట్టుకొని  మేము చదువుకుంటూ ఉండే వాళ్ళం.
             
                   దాని  బయట తాటాకులతో వేసిన చిన్నవసారా.  దాని క్రింద  ఇటుక, మట్టి తో కట్టిన అరుగు ఉండేది.  దానికి చిన్న కరెంటు బల్పు వేలాడుతూ, వెలుగుతోంది. ఆ అరుగు మీదే పగలంతా దేవుడికి పూలమాలలు కట్టడం ,  వచ్చేపోయే వాళ్ళ తో కబుర్లు కాకర కాయలాడటం చేస్తుంటాడు గంగయ్య కొడుకు శీను.
   
                        పది దాటిపోయింది . ఇంకా రాలేదు శేఖరం అనుకుంటూ పుస్తకం పట్టుకొని వచ్చి ఆ అరుగు మీద కూర్చున్నాను. చదువుకొనే రోజుల్లో  రాత్రి పది, పన్నెండు అంటే  లెక్కలోదికాదు. అందుకే  వస్తాడు లే అనుకుంటూ పరకాయించి గేటువైపు చూశాను.  గేటునుంచి ఒక కి.మీ దూరం ఉంటుంది నేనున్న మోటారు గది. ఎవ్వరూ కనపడ్డంలేదు. నెమ్మదిగా మనసు లో ఏదో అలజడి మొదలైంది . అక్కడ , అంత రాత్రి పూట నేను ఒంటరిగా ఉన్నానన్న విషయం  ఒక్కసారిగా గుర్తుకొచ్చింది. ఐదు సంవత్సరాలు గా తిరుగుతున్న ప్రదేశమే. అయినా ఎందుకో . ఏమిటోగా అన్పించింది. అలాగే కూర్చొని బావి మీదుగా గేటువైపు చూపు సారించాను.
               
                         దూరంగా ఎవరో వస్తున్నట్టు  రూపం కన్పిస్తోంది . వస్తున్నాడులే  అనుకోగానే మనసు కాస్త కుదుటపడింది.  బావి కి అవతలి వైపుకొచ్చాడు.  అంటే   నా మాట వినపడేంత దూరం.  “ ఏమిటయ్యా. ఇంత ఆలస్యం చేశావు …… అంటూ పలకరిస్తున్నాను నేను. కాని అతను బావి ప్రక్కనుండి తిరిగి గది దగ్గరకు రాకుండా బావి మీద నుండి  అడ్డం గా నడిచి రావడం మొదలు పెట్టాడు. ఆశ్చర్యం. బావి మధ్య లో శూన్యంలో నిలబడిపోయింది ఆ రూపం నా వైపుకు తిరిగి . ఆ వచ్చింది శేఖరం కాదనుకోవడానికి నాకు సెకను పట్టలేదు. మరి .....................

                   పొద్దున్నే పూలుకోయడానికి వచ్చిన గంగయ్య తట్టి లేపితే మెలుకవ వచ్చింది. అంతే.



                                 మన లోని భయం మనకు ఎన్ని రూపాలను కల్పించి, కన్పించి భయపెడుతుందో ఇప్పుడు  తలుచుకుంటే నవ్వొస్తుంది . ఇది నలభై సంవత్సరాల క్రిందటి మాట .

                        భయం లో ఉన్న వ్యక్తి కి తన  పెరటి లోని అరటిచెట్టే  జడల దెయ్యం లా కన్పిస్తుందన్న పెద్దలమాట ప్రత్యక్షరసత్యం.




******************************************************************************                            

Thursday 17 October 2013

విశ్వాసమా! నీవెక్కడ ?


                               విశ్వాసమా! నీవెక్కడ ?
                         

                            మన లో విశ్వాసమనే ఒక మాట ఉంది. కాని  ఆ మాట ఇప్పుడు నిఘంటువులకే పరిమితమై పోయింది. ఎందుకంటే  పెంపుడు జంతువులు ఎంతో విశ్వాసం గా ఉంటాయని చెప్పుకుంటుంటాము. విశ్వాసాన్ని గురించి చెప్పేటప్పుడు ముందుగా మనం శ్వానాన్ని గురించే చెప్పుకుంటాము.  ఎవరైనా ఒక విశ్వాసపాత్రుణ్ణి గురించి చెప్పాలంటే వాడు కుక్క లాగ విశ్వాసం గా పనిచేసేవాడు అనే వాళ్లు  మన పెద్దవాళ్లు. ఆ మాటల్లో ఎంతో అభిమానం దాగి ఉండేది.
                
                          

                      

                                అంతవరకు ఎందుకు మా చిన్నప్పుడు మా దొడ్లో  ఉన్న గేదెల్లో ఎఱ్ఱగేదె ఒకటుండేది. దాన్ని అవనిగడ్డ సంత నుంచి ఆ రోజుల్లో రెండువందల ఏభై రూపాయలకు కొనుక్కొచ్చారని చెప్పుకొనేవాళ్లు. అది చివరకు..   మా దొడ్లోనే పోయింది. అసలు చెప్పదలచిందేమిటంటే అది ఎప్పుడు పాలుతీసినా అంటే రోజుకు మూడుసార్లు తీసినా ఇచ్చేది.  ఎవరైనా కాఫీ గత ప్రాణులు మథ్యాహ్నం  ఏ మూడు గంటలప్పుడో బస్సు దిగి వస్తేనో, అదే సమయానికి  ఇంట్లో  ఉన్నపాలు ఏ పిల్లో తాగేసో, పార పోసో ఉంటేనో వెంటనే మా  నాయనమ్మ గారు లోటా తీసుకొని గేదె దగ్గరకు వెళ్లేది. ఆ గేదె ఒక్కసారి ఆవిడ  వంక  తేరిపార చూసి  పాలు ఇవ్వడానికి సిద్ధపడేది. ఆ దృశ్యం నాకు ఇప్పటికీ జ్ఞాపకమే.
                                  
                            అన్నింటి కంటే గుర్తుకొచ్చే విషయమేమిటంటే --  అది ముసలిదై పోయి,వట్టిపోయిన తరువాత కూడ మేత దండగ మాకు ఇచ్చేయమని  వాళ్లు వచ్చి అడిగితే మా తాతగారు  అన్న మాటలు నలభై ఏళ్ల తర్వాత  ఇప్పుడు కూడ నాకు గుర్తున్నాయి. వద్దులేరా!. దాన్ని అలాగే ఉండనీయండి. పోతే అప్పడు చూద్దాం.  “ అంటూనే లోపలికి వెళ్లిపోయారు మరో మాటకు  అవకాశం ఇవ్వకుండా. ఈ మాటలు ఆయన అంటున్నప్పుడు ఆ గేదె పురి గట్టు దగ్గర పడుకొని  నోట్లో గడ్డి పరకలతో లేవలేని స్థితి లో  చూస్తూ ఉంది.  మరి.. దానికి ఆ మాటలు అర్ధమయ్యాయో ? లేదో ?
             
                                   ఇంకోమాట. మా ఊరికి ప్రక్క ఊళ్లో ఒక  రైతు ఉండేవాడు. మా పొలాలు కూడ ఆయనే చేస్తుండేవాడు. ఆయన రాత్రిళ్ళు ఎక్కువగా ఆరు బయటే పడుకొనేవాడు,  లేకపోతే వరండాలో పక్కపరుచుకొనేవాడు. పక్కనే జీతగాడు తోడు.   పెద్ద పెరడు. పశువుల కొట్టం.  పురుల నిండా ధాన్యం.  అటువంటి ఆయనకు  ఒక  పెద్ద పెంపుడు కుక్క ఉండేది.  అది  దొడ్లో ఎక్కడ కొంచెం అలికిడైనా  అరచి  హడావుడి చేయడమే కాకుండా ఆదమరచి నిద్రపోతున్న యజమాని గుండెల మీద  కాళ్లు పెట్టి, తట్టి లేపి, ప్రమాదాన్ని హెచ్చరించేదట.
                                           
                               అయితే ఒకసారి  గ్రామం లోని పంచాయతీ కక్షలతో ప్రత్యర్థులు   రాత్రిపూట ఆరుబయట పడుకున్న ఆయనపై దాడిచేశారు. వాళ్లు కొట్టిన కర్ర దెబ్బలకు  ఆయన్ను అదుముకొని ముందుగా బలైంది ఆ పెంపుడు కుక్కే. హాస్పటల్ నుంచి వచ్చిన తరువాత ఆ పెద్దాయన దాన్ని గురించి చెప్పుకొని ఎన్నిసార్లు కన్నీరు పెట్టుకొనేవాడో మా ఇంటి అరుగు మీద కూర్చొని.
                       
                                    ఇదంతా  ఆ కాలం నాటి మాట. కాని ఇప్పుడు కాలం మారింది. విశ్వాసం అనే మాట   మాయమయ్యింది. . ప్రేమ ,  అనురాగం , అభిమానం , ఆత్మీయత  వీటన్నిటినీ మించి బాథ్యత-   వీటిని కాసేపు మర్చిపోయినా ఎన్నో కష్టనష్టాల కోర్చి పెంచి  పెద్ద చేసిన  అమ్మానాన్నల్ని చివరిరోజుల్లో నైనా చూడాలనే  కనీస విశ్వాసం కూడ  నేటితరానికి లేకుండాపోతోంది..   
                              
               నలుగురు కొడుకులను కని, పెంచిన  ఒక మాతృమూర్తి ని  చివరి రోజుల్లో చూడటానికి వచ్చందాలు పోయి,వాటాలు కుదరక  ఆవిడ బ్రతికుండగానే మోసుకెళ్లి  స్మశానం లో వదిలి పెట్టి వచ్చిన కన్నకొడుకులు,” “ ముసలి తల్లిని  రచ్చబండ మీద వదిలేసి కుటుంబం తో దూరప్రాంతం లో ఉద్యోగానికి వెళ్లిపోయిన ఒక్కగానొక్క కొడుకు  వంటి  వార్తలు వింటుంటే మానవత్వం ఏనాడో మంట కలిసి పోయి. విశ్వాసాన్ని వెంట తీసుకెళ్లిందేమో ననిపిస్తోంది.
                                   
               అందుకే తాను పనిచేస్తున్న యజమాని కొడుకునే  కిడ్నాప్ చేసే డ్రైవరు, యజమానురాలి గొంతుకోసి నగలు దోచుకొన్న పనిమనిషి ,  ఇంట్లో అద్దె కి ఉంటూనే  నగల కోసం ఇంటి యజమానురాలిని చంపి మూట కట్టిన కిరాతకుడు వంటి వార్తలు వింతగా అనిపించడం లేదు.
                           
                       హే భగవాన్ ! మానవత్వాన్ని  బ్రతికించు      ! విశ్వాసాన్ని  వెలిగించు !”
                                  




***********************************************

         

                    

Saturday 5 October 2013

ఒక నిద్ర పట్టని రాత్రి



                               ఒక నిద్ర పట్టని  రాత్రి
                        
                   కంటినిండా నిద్ర పడితే ఎంత హాయిగా ఉంటుందో అందరికీ  అనుభవమే.కాని ఆథునికయుగంలో  అందునా మహానగరాల్లో నివసించేవాళ్లు మంచి నిద్ర అనే మాట మర్చిపోయి చాలకాలమై ఉంటుంది.. రకరకాల ఒత్తిడులు,వృత్తిపరమైన ఆలోచనలు, కొన్ని తెచ్చిపెట్టుకున్న సమస్యలు ఏవి ఏమైనా హాయిగా నిద్ర పోతున్న రాత్రులు నేటి తరానికి తక్కువేనేమో. దాని వలన పగలంతా  బడలిక, చేసే పనిలో చిరాకు మమూలై పోతున్నాయి.
                         
                    ఏమైనా గాని అందరూ హాయి గా గురకపెట్టి నిద్ర పోతుంటే   మనం మాత్రం  నిద్ర రాక కొట్టుకుంటూ   మాటి మాటికి టైము చూసుకుంటూ తెల్లార్చడం మాత్రం ఒక భయంకరమైన చెప్పుకోలేని శిక్ష.
                  
                    అదే ఈ మధ్య జరిగింది . ఏవో వేడుకలను పురస్కరించుకొని  భాగ్యనగరం లో బంధువుల ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. పగలంతా కబుర్లు,కాకరకాయలతో కాలం గడిచి పోయింది.  రాత్రి అయ్యింది.  భోజనాలయిన తరువాత ఎవరికి కేటాయించిన గదుల్లోకి వారు చేరుకున్నాము. కొత్తచోటు. తలగడ  కూడ ఎత్తు చాలడం లేదనుకుంటా. కొంచెం ఇబ్బంది గా ఉంది. నిద్రపట్టడం లేదు.ప్రక్కనున్నమంచం మీద  శ్రీమతి  మాత్రం గురక పెట్టి నిద్ర పోతోంది. నాకు నిద్రరావడం లేదు.తను మాత్రం  హాయిగా నిద్ర పోతోంది. అదొక కోపం.  నిద్ర లేక పోవడానికి అది రెండో రోజు.ఇవాళ ఎలాగైనా మంచి నిద్రపోవాలని నిశ్చయించుకున్నా. అయినా నిద్ర రావడంలేదు.
                  
                        ఒకసారి సెల్ తీసి టైమ్ చూసా. పన్నెండు . మూడునిమిషాలు తక్కువ. ఏవో నోటికొచ్చిన శ్లోకాలు చదువుకుంటూ కళ్లు మూసుకున్నా. అసలు నిద్ర ఎందుకు రావడం లేదు. ఇది ఒక  సమాథానం లేని ప్రశ్న.  అసలు విచిత్రమేమిటంటే నిద్ర రావడం లేదు అని అనుకుంటేనే అది రాకుండా పోతుందేమో నని నాకు అనుమానం.
        
                           కునుకు పడు తున్నదనుకుంటా. ఇంతలో ముఖం మీద ఏదో నీడ పడుతున్నట్టయి మెలుకువ వచ్చింది. కళ్లు తెరిచా. కిటికీ తెరల చాటు నుంచి ఏదో నల్లని ఆకారం గోడ ఎక్కుతోంది. భయమనుకుంటా. ఒక్కసారి వంట్లోకి వెళ్లి  ఝల్లుమని ఊపేశింది.  కొంచెం తమాయించుకొని మళ్లీ చూశా. దాని వెనక ఇంకొక ఆకారం కూడ గోడ ఎక్కు తోంది. కిటికీ దగ్గరగా వెళ్లి చూశా.  అనుమానం తీరిపోయింది. అవి  ఆ ప్రాంతం లోనే తిని తిరుగుతూ బాగా బలంగా పెరిగిన గ్రామ సింహాలు.  ఇంటి వాళ్లు  బయట  చెత్త బుట్ట ల్లో పారేసిన మిగిలిన పదార్థాల కోసం అవి అలా తిరుగు తుంటాయని తరువాత తెలిసింది. మల్లీ  తిరిగి వచ్చి  మంచం మీద  కూర్చుంటూ టైము చూశాను. పావు తక్కువ రెండు. ఒక సారి ఛీ అంటూ చిరాగ్గా అనుకొని  మళ్లీ పడుకున్నాను.
          
                  నిద్ర పడుతోందనుకుంటా. ఇంతలో గది తలుపు టిక్ మని శబ్దం చేస్తూ తెరుచుకుంది. ఎవరూ? నెమ్మదిగా లేచి బయటికొచ్చా.  అటు ఇటు చూశా.  ఎవరూ లేరు. అది డుప్లెక్సు హౌస్. మా గదికి  ఆనుకొనే పైకి మెట్లున్నాయి. మెట్ల వెంబటే పైకి చూశా. ఎవరూ లేరు. మెట్లమార్గం లో  చిన్నలైట్ వెలుగుతూనే ఉంది. ఇంతలో మనసులోకి ఎప్పుడో చూసిన ఒక హర్రర్ సినిమా  లో ఒక దృశ్యం గుర్తుకొచ్చేసింది. మెట్ల వెంబటే  తెల్లని బట్టల్లో చేతిలో కొవ్వొత్తి తో  ఒక ఆకారం నడచి వస్తున్నదృశ్యం అది.
                       
                    ఈ సారి భయం వేయ లేదు.  నవ్వొచ్చింది. మనసు బలహీనమైతే ఏమైనా కన్పిస్తాయి. హాలు లోకి చూశాను. ఒక మూలగా మా డ్రైవరు హాయిగా పడుకొని నిద్ర పోతున్నాడు.  మళ్లీ గదిలోకి వచ్చాను. కాసిని మంచినీళ్లు తాగి పడుకున్నాను. ఎప్పుడో నిద్ర పట్టేసింది. కొంచెం ఆలస్యంగా లేచాను.
            
                  ఎవ్వరూ అడక్కపోయినా  వాళ్ల చూపులు నాకు అర్ధమయ్యాయి. రాత్రి జరిగిన దంతా నేనే చెప్పేశా. అందరం హాయిగా నవ్వుకున్నాం.
                 
                       అందుకే అందరూ నిద్ర పోతున్నప్పుడు ఒక్కడే మేలుకొని ఉండకూడదు అని నీతిశాస్త్రం  చెపుతోంది అన్నారు  అక్కడే ఉన్న ఒక పెద్దాయన.
                    

                              ఈ రోజు రాత్రైనా బాగా నిద్ర పోవాలి  అనుకుంటున్నా.ఏమౌతుందో. ఏమో.!






**************************************************************************