బాదం చెట్టు
బాదం చెట్టు. అవును బాదం చెట్టు ను చూస్తే నాలో ఏదో ఒక ఆత్మీయత. ఒక అభిమానం కలుగుతాయి. శ్రీ అడవి బాపిరాజు చెప్పిన దేశీయ పుష్పాలు లాగానే ఇది కూడ దేశీయ వృక్షమేమో.? అవునో కాదో కాని బాదం చెట్టును చూస్తే మాత్రం తెలుగు
చెట్టేమో నని పిస్తుంది నాకు.
మా చిన్నప్పుడు ప్రతి రెండు ఇళ్లకి ఒక కరివేపాకు
చెట్టు, వీథికి కనీసం రెండయినా బాదం చెట్లు ఉండేవి. అప్పుడు ఇళ్ళు అంటే ఇంటి వెనుక పెరడు, ఇంటిముందు ఖాళీ స్థలం కలుపుకుంటే
ముఫై , నలభై సెంట్లు పైగా ఉండేవి. బొప్పాయి, జామ, ఉసిరి ,గోరింట తో పాటు
దొడ్లో బాదం చెట్టు కూడ ఉండటం మామూలై పోయేది. మనం ప్రత్యేకంగా బాదం చెట్టు
పెట్టక పోయినా ప్రక్క వీథిలో ఎక్కడైనా బాదంచెట్టు ఉంటే చాలు కాకులు పండు బాదంకాయల్ని ముక్కున
కరుచుకొచ్చి మన దొడ్లో చెట్టుమీదో ,గోడమీదో కూర్చుని తినేసి, మిగతాభాగాన్ని
వదిలేసేవి. ఇంకేముంది? కొన్ని
సంవత్సరాలకు మన దొడ్లో కూడ బాదంచెట్టు ఉండేది. ఇదీ అసలు విషయం.
ఆ రోజుల్లో సంక్రాంతి కి అరిసెలు చేసుకోవాలంటే బాదమాకులు
కావాలి. గారెలు చేసుకోవాలంటే బాదమాకులు కావాలి.
చెన్నుని గుళ్ళో ధనుర్మాసం రోజుల్లో వేడివేడి గా పెట్టే చక్రపొంగలి, కట్టెపొంగలి చేతులు కాలకుండా తినాలంటే బాదమాకులు కావాలి. మన
ఇంట్లో రుబ్బుకున్న గోరింటాకు ను స్నేహితురాండ్ర కు పంచాలంటే బాదమాకులు కావాలి.
అన్నింటికీ మించి ఏ మిట్టమథ్యాహ్నం వేళో అనుకోని అతిథి గా ఏ బంధువో వస్తే అప్పటి కప్పుడు విస్తరి కావాలంటే
నాలుగైదు బాదమాకులు,ఒక వీనెపుల్ల ఉంటే
సరిపోతుంది.
ఉమ్మడి
కుటుంబాల్లో ఇరవై , ముఫై మంది పిల్లలకు
పండక్కి చేసుకున్న పిండివంటలు, తినుబండారాలు పెట్టాలంటే చక్కగా సరిపోయేవి బాదమాకులు. శ్రోత్రీయ కుటుంబాల్లో వీటి అవసరాలు ఇంకా
ఎక్కువగా ఉండేవి.
కారణాలు ఏమైనా గాని బాదం చెట్టు ను చూస్తే మాత్రం నాకు చిన్ననాటి స్నేహితుణ్ని
చూసిన భావనే కలుగుతుంది. నా బాల్యం తో ఆ
చెట్టుకున్న అనుబంథం అటువంటిది. మా తాతగారి ఊరు కృష్ణాజిల్లా కురుమద్దాలి.
మాతండ్రి గారు ఇంటికి పెద్దకొడుకు అవడం తో, ఉమ్మడి కుటుంబం లోనే నాబాల్యమంతా
గడిచింది. మేము ఐదుగురు అన్నదమ్ములం. ఇద్దరు అక్కచెల్లెళ్ళు. మాకు ఐదుగురు మేనత్తలు, ఒక బాబాయి. పండుగలకు,
పబ్బాలకు, వేసవికాలం సెలవులకు బాబాయి పిల్లలు,
అత్తయ్యల పిల్లలు మేము కలిస్తే సుమారు ముఫై మంది. ఎదురింటి ,పక్కింటి, పొరుగింటి
పిల్లలు కలిస్తే ఈ లెక్క అర్థశతం. మరి వీళ్లందరినీ ఎవరు భరించాలి.? ఇంకెవరు?. గుడిలోని
బాదంచెట్టు.
మా ఇంటి ప్రక్కనే చెన్నకేశవస్వామి
గుడి ఉండేది.” ఇంటికన్న గుడి పదిలం” అని అందరం
గుళ్ళో చేరే వాళ్ళం. గుడి వెనకాల ఒక పెద్ద బాదంచెట్టు ఉండేది. దాని క్రిందే మా
ఆటస్థలం . చెట్టు క్రిందరాలిపోయిన ఎండుటాకులు, చెట్టు పైన కొమ్మల
చివర రెమ్మల్లో ఎఱ్ఱబడిన పండుటాకులు,
వానికి ఆనుకొని అమ్మచాటు బిడ్డలాగ ఆకుపచ్చని పచ్చిఆకులు, కొమ్మ రెమ్మ
కలిసే చోట గుత్తులు,గుత్తులు గా
బాదంకాయలు. కొన్నిఎఱ్ఱగా పండి చిలకముక్కుల్లాగా మురిపిస్తుంటే అదే గుత్తిలో
మరికొన్ని ఆకుపచ్చగా ఒదిగి ఉండి అన్నఒడి లో ఆడుకుంటున్న చెల్లెలు
లాగా ఉండేవి.రెమ్మల చివర పెరుగుతున్న చిగురుటాకులు తమలపాకు చిలకల్లాగ ముద్దు గా ఉండేవి.
ఆ చెట్టు క్రింద చల్లని నీడలో మండవేసవి కూడ
తెలియకుండా ఆటల తిరునాళ మొదలయ్యేది. ఎన్నేన్నిరకాల ఆటలు - కళ్లకు గంతలు నుండి
నేలబండ, అచ్చంగిల్లాలు , పదిగళ్ల ఆట, వామనగుంటలు, చింతపిక్కలవరకు ఎవరి ఇష్టం
వారిది. కొంతమంది రాలిన
పండుకాయల్ని ఏరుకుపోయి,దూరంగా ఉన్నబండ మీద పెట్టి గుండ్రాయి తో కొట్టి బాదంపప్పు
తీసుకొని తింటుండేవారు. బాదంకాయ రసం చింది,బట్టలపై పడ్డ మరకలు పోయేవి కాదు. అది
వేరే సంగతి.
ఆ నాటి
బాల్యం అక్కడ ఎంత కాలాన్ని గడిపేసిందో కాని ఇప్పటికీ ఆ చెట్టుని మర్చిపోలేక పోతున్నాను.
. కొసమెరుపు ఏమిటంటే ఆ చెట్టు నిండా
పెద్దపెద్ద గండు చీమ లుండేవి. అవి కుడితే అంతవరకు చర్మం ఊడిపోయి నెత్తురు
కారేది. అయినా మాలో కొంతమంది ఒక
మెళుకువను నేర్చారు. అదేమిటంటే చీమలు మీద పాకుతున్నా దులుపుకోకుండా ఉంటే అవి కుట్టవు
అని. ఈ చిట్కాని ప్రయోగించి కొందరు
చెట్టెక్కి పండు పండుకాయల్ని కోసుకొచ్చేవాళ్లు. కొందరు కొంతదూరమెక్కి, చీమలు పాకే
గిలిగింత తట్టుకోలేక ఒక్కసారి చెయ్యో, కాలో
విదిలించే వాళ్ళు. దానితో చీమలు కుట్టడం మొదల య్యేది. అది తట్టుకొలేక పట్టుతప్పి కిందపడిపోవడం,
కాలో,వేలో విరగడం పిండికట్టువరకు
వెళ్లడం,ఇంట్లోవాళ్ళ మందలింపులు ఇవన్నీ
మరువలేని జ్ఞాపకాలే.
ఆనాటి వారిలో కొందరు పోయారు. కొందరు
ఎక్కడున్నారో తెలియదు.కాని నాలోని జ్ఞాపకాలు
మాత్రం చిగుళ్లు తొడుగుతూనే
ఉన్నాయి. మనసు చంపు కోలేక ఈ మథ్యనే మా ఊరు
వెళ్ళాను. ఆ చెట్టు అలాగే ఉంది. ఇంకా లేతగా ఉంది. ఆశ్ఛర్య పోయాను. కాని తరువాత తెలిసింది. అది
ఆనాటి చెట్టుకాదు. అప్పుడెప్పుడో వచ్చిన
పెద్ద గాలివాన కు ఆ చెట్టు కూలిపోయింది. కొట్టేశారు. కాని అదే ప్రదేశంలో మరో చెట్టు
పెరిగి పెద్దదయిందట. ఏమైతేనేం.! బాదంచెట్టు
బ్రతికే ఉంది నాలోని జ్ఞాపకాల్లాగా
సజీవంగా అనుకుంటూ వెనుదిరిగాను నేను.
మనసుకు తగిలిన గాయాలకు మధురమైన జ్ఞాపకాలే కదా మందు.
*******************************************************************



నిజం. బాదం చెట్టును తలుచుకుంటేనే ఎన్నో మధురస్మృతులు తలపుకు వస్తాయి. మేము పోర్టోరికొ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అనేక బాదం చెట్లను చూసి ఎంత సంతోషం కలిగిందో!
ReplyDeleteమీ టపా చూసాక మహదానదం గా ఉంది, నాకు కూడా బాదం చెట్టు అంటే చాల ఇష్టం. కారణం మీరు టపాలొ వ్రాసిన విషయాలె..
ReplyDeleteచాలా బావున్నాయి మీ కబుర్లు. నేనూ ఎఱ్ఱగా పండిన బాదం కాయల్ని తినేదాన్ని మా వూళ్ళో. వాటి రుచి నాకింకా జ్ఞాపకమే. ఇప్పటి పిల్లలు చాలా మిస్ అవుతున్నారనిపిస్తుంది ఒక్కోసారి.
ReplyDeleteమీ అభిమానానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు
ReplyDelete