వెన్నెల రేయి
ఏటి ఇసుక పై పరుచు కున్న పల్చని వెన్నెలలో
ఒంటరిగా కూర్చున్నాను నేను .
పుష్యమాసపు చలిగాలులు సున్నితంగా
తట్టి పలకరిస్తున్నాయి .
దూరంగా ఉన్న నీటి పాయలో కృష్ణమ్మ
జలకాలాడుతున్నట్లు
సన్నని సవ్వడి.
వెన్నెల పూలతేరు మీద మెలమెల్లగా సాగి వచ్చింది
ఆమె
చేమంతుల విరి
కాంతులు అల్లి బిల్లిగా అల్లుకున్న
వింత సోయగం ఆమెది.
నిడుద పెన్నెఱి వేణి లో తురుము కున్న
విరజాజులు
ఆమె
శరీరపు పరిమళం తో ఉక్కిరి
బిక్కిరవుతున్నాయి.
చలి రాత్రి వెన్నెల వెలుగుల్లో ముంగిట వేసిన ముగ్గులు
ఆమె కొఱకు అందంగా పఱచిన తివాసీలు.
గొబ్బి ముత్తైదువులు హరిదాసుల
చేత ఆలపింపజేసిన
కీర్తనలే ఆమెకు స్వాగత గీతికలు.
కీర్తనలే ఆమెకు స్వాగత గీతికలు.
వాకిట గుమ్మానికి కట్టిన మామిడి
రెమ్మలు
తలకు తగులు తుంటే,
గుమ్మానికి వ్రాసిన పసుపు కుంకుమలు
పాదాలకు పారాణి
దిద్దుతుంటే,
పట్టు పరికిణీ ని పైకి
పట్టుకొని పొందికగా
అడుగిడింది మా ముంగిట్లోకి సంక్రాంతి లక్ష్మి.
అలకలు తొలగి ఆనందాన్ని పంచుకొన్న ఆలుమగలకు
ఆ రోజే సంక్రాంతి.
ఎన్నాళ్ళ నుండో చూస్తున్న మధుర క్షణం
వచ్చి
అమ్మాయికి వేవిళ్లని తెలిసిన
కన్నతల్లి కి ఆనాడే సంక్రాంతి.
అది కూడ అయ్యిందని తెలిసి
అప్పుడేనా అని
ముచ్చటగా మూతి మూడిచిన ఆ అబ్బాయికి
మాత్రం
ఆనాడే మొదలైంది విశ్రాంతి.
.....................................అందరికీ సంక్రాతి శుభాకాంక్షల తో

No comments:
Post a Comment